
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ ఉభయసభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే వింటర్ సెషన్ ముగిసింది. ఈ నెల 4న ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు 14 రోజులు నడిచాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ సమావేశాలను కీలకంగా భావించిన కేంద్రం.. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కీలక బిల్లులను పాస్ చేసుకుంది. బిల్లుల ఆమోదం అనంతరం సభను స్పీకర్ ఓం బిర్లా నిరవధికంగా వాయిదా వేశారు. ఇటు రాజ్యసభలో క్రిమినల్ కోడ్ బిల్లులు, టెలికమ్యూనికేషన్స్ బిల్లు ఆమోదం తర్వాత సభ గురువారం నిరవధికంగా వాయిదా పడింది. వింటర్ సెషన్ లో లోక్ సభ మొత్తం 61 గంటల 50 నిమిషాల పాటు నడిచిందని స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. దిగువ సభలో 74 పర్సెంట్ ప్రొడక్టివిటీ నమోదైనట్లు పేర్కొన్నారు. ఈసారి మొత్తం 18 బిల్లులు ఆమోదం పొందాయని చెప్పారు. రాజ్యసభ 65 గంటలు సాగిందని, సభలో 17 బిల్లులు పాస్ అయ్యాయని చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ వెల్లడించారు. ప్రొడక్టివిటీ 79 శాతంగా నమోదైందన్నారు.
కీలక బిల్లులకు ఆమోదం..
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ), ఎలక్షన్ కమిషనర్ (ఈసీ)ల నియామకానికి సంబంధించిన ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ (అపాయింట్ మెంట్, కండీషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్)-2023’ బిల్లుకు లోక్ సభ గురువారం ఆమోదం తెలిపింది. దీనిపై స్వల్పకాలిక చర్చ అనంతరం వాయిస్ ఓటు ద్వారా సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు రాజ్యసభలో ఇప్పటికే పాస్ అయింది. ఇక రాష్ట్రపతి ఆమోదం లభిస్తే చట్టంగా మారనుంది. కొత్త బిల్లు ప్రకారం ప్రధాని నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ సీఈసీ, ఈసీలను నియమించనుంది. టెలీకమ్యూనికేషన్స్ బిల్లు బుధవారం లోక్ సభ లో పాస్ కాగా, రాజ్యసభ గురువారం వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది. కొత్త బిల్లు ప్రకారం ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో టెలికాం నెట్ వర్క్ మొత్తాన్ని ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకునేందుకు వీలుంది. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు కూడా ఇంతకుముందే రాజ్యసభలో పాస్ కాగా, గురువారం లోక్ సభ కూడా ఆమోదించింది. న్యూస్ పేపర్లు, పీరియాడికల్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను సులభతరం చేసేందుకు కేంద్రం ఈ బిల్లును తెచ్చింది.
మరో ముగ్గురు ఎంపీలపై వేటు
లోక్‌సభలో మరో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇప్పటిదాకా సస్పెన్షన్‌కు గురైన లోక్‌సభ ఎంపీల సంఖ్య 100కు, రాజ్యసభ ఎంపీల సంఖ్య 46కు చేరింది. కాగా, లోక్‌సభ, రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు పాత పార్లమెంటు బిల్డింగ్ నుంచి విజయ్ చౌక్ దాకా ర్యాలీ నిర్వహించారు. ధన్‌ఖడ్‌కు ప్రతిపక్ష ఎంపీలు క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ నేతలు జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలిపారు.
రాజద్రోహ సెక్షన్ కు గుడ్ బై: మోదీ
కొత్త క్రిమినల్ చట్టాలను ఆమోదించడం ద్వారా కాలం చెల్లిన రాజద్రోహ సెక్షన్ కు తమ ప్రభుత్వం గుడ్ బై చెప్పిందని ప్రధాని మోదీ అన్నారు. బ్రిటీష్ కాలం నాటి ఐపీసీ, సీఆర్ పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ ల స్థానంలో కొత్త చట్టాలు తేవడంతో నవ శకం ప్రారంభమైందంటూ ఆయన ట్వీట్ చేశారు.