వన మహోత్సవం టార్గెట్ ​.. 73 లక్షల మొక్కలు

వన మహోత్సవం టార్గెట్ ​.. 73 లక్షల మొక్కలు
  • నర్సరీల్లో అన్ని రకాల మొక్కలు సిద్ధం
  • జూన్​ 15 నుంచి కార్యక్రమం, అనుకూలంగా వాతావరణం

మహబూబ్​నగర్, వెలుగు: వేసవి కాలం ముగుస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ‘వన మహోత్సవం’ కార్యక్ర మంపై దృష్టి పెట్టింది. గతేడాది ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించగా.. ఈ ఏడాది కూడా పెద్ద మొత్తంలో మొక్కలు నాటేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే నర్సరీలలో మొక్కలు రెడీగా ఉండగా.. మరికొన్ని మొక్కలను దిగుమతి చేసుకునేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.

మహబూబ్​నగర్  టార్గెట్​ 58 లక్షల మొక్కలు

గతేడాది కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా మహబూబ్​నగర్​ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం 55 లక్షల మొక్కలు నాటాలని టార్గెట్​ పెట్టింది. దీంతో డీఆర్డీఏతో పాటు అటవీ శాఖ టార్గెట్​ను రీచ్​ అయ్యాయి. అయితే ఈ ఏడాది కార్యక్రమం కింద జిల్లాలో 58.18 లక్షల మొక్కలు నాటాలని టార్గెట్​ విధించింది. అందుకు అనుగుణంగా మొక్కలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే నర్సరీలలో అందుబాటులో మొక్కలు ఉండగా.. డీఆర్డీఏ కూడా 11 లక్షల మొక్కలను పెంచుతోంది. ఇచ్చిన టార్గెట్​లో డీఆర్డీఏ ఆధ్వర్యంలో 39.13 లక్షల మొక్కలు, ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​ ఆధ్వర్యంలో 1.80 లక్షల మొక్కలు, మిగతా 11 లక్షల మొక్కలను ఆయా డిపార్ట్​మెంట్ల ఆధ్వర్యంలో నాటాల్సి ఉంది. 

ఇందులో ఇప్పటికే మున్సిపల్​ శాఖ ఆధర్యంలో పలు రకాల మొక్కలను కొనుగోలు చేసి కాపాడుతున్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నడుస్తున్న నర్సరీలలో కూడా పలు రకాల మొక్కలను సిద్ధం చేసి ఉంచారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే.. జూన్​ 15 నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సెప్టెంబరు నెలాఖరు వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. అలాగే నారాయణపేట జిల్లాకు 15.40 లక్షల మొక్కలను నాటాలని టార్గెట్​ పెట్టారు. జిల్లాలో 280కి పైగా నర్సరీలు ఉన్నాయి. ఈ నర్సరీల్లో 13 లక్షల మొక్కలను నాటాలని టార్గెట్​ పెట్టారు. ఇప్పటి వరకు 90 శాతం మొక్కలను పెంచారు. అలాగే 44,450 ఈత చెట్లు, 4,934 తాటి చెట్లను సంరక్షిస్తున్నారు. ఇవి రాకుండా 6,78,921 వివిధ రకాల మొక్కలను సంరక్షిస్తున్నారు.

అవెన్యూ, హోం సీడ్​ ప్లాంటేషన్..

వన మహోత్సవంలో భాగంగా నర్సరీల్లో రోడ్ల పొంటి నీడనిచ్చే మొక్కలతో పాటు ఇంటి పెరట్లో నాటే మొక్కలను అందుబాటులో ఉంచుతున్నారు. వీటిని ఫ్రీగా అవసరం ఉన్న వారికి ఇవ్వనున్నారు. ప్రధానంగా రోడ్ల పొంటి అవెన్యూ ప్లాంటేషన్​ ద్వారా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో మొక్కలను నాటనున్నారు. అవెన్వూ ప్లాంటేషన్​లో భారీ వృక్షాలతో పాటు నీడను ఇచ్చే మొక్కలున్నాయి. అందులో వేప, నేరేడు, గుల్​మోర్, సిస్​, నెమలి నారు, మర్రి, పొగడ, రెయిన్​ ట్రీ, సీమ రూబ, బాదం మొక్కలు ఉన్నాయి. 

అలాగే హోం సీడ్​ ప్లాంటేషన్​ కింద ఇండ్లలో నాటే మొక్కలను అవసరం ఉన్న వారు నర్సరీలకు వచ్చి తీసుకెళ్లొచ్చు. ఇక్కడ నిమ్మ, జామ, మామిడి, మునగ, పారిజాతం, తులసి, ఉసిరి, గన్నేరు మొక్కలను సిద్ధంగా ఉంచారు.

పెంపకం సరే.. సంరక్షణ ఏది?

వన మహోత్సవంలో భాగంగా పెద్ద మొత్తంలో మొక్కలు నాటుతున్నారు. కానీ, వాటిని సంరక్షించే బాధ్యతను విస్మరిస్తున్నారు. గతేడాది గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. నాటిన మొక్కలు 80 శాతం వరకు సంరక్షించాలని రూల్​ కూడా పెట్టారు. కానీ, ఎక్కడా సగానికి సగం మొక్కలు కూడా జీవం పోసుకోలేదు. వర్షాకాలంలో కొంత మేరకు పెరిగినా.. ట్రీ గార్డ్, ఇంతర సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో పశువులు, జీవాలకు మేతగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో నాటిన మొక్కలు ఎండిపోవడంతో వాటికి నిప్పు పెట్టిన ఘటనలు ఉన్నాయి. ఎండా కాలంలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు లేదా నీటి ట్యాంకర్ల ద్వారా రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలకు నీరు పోసి వాటిని కాపాడాల్సి ఉండగా, జిల్లాలో చాలా చోట్ల మొక్కలకు నీరు పట్టడం లేదు.