
- విధి నిర్వహణలో బోర్డు విఫలమైందంటూ ఈఎన్సీ అనిల్ లేఖ
- నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేసినా చేష్టలుడిగి చూస్తున్నారని ఫైర్
- బొల్లాపల్లి రిజర్వాయర్‌తో గ్రామాల ముంపుపై సర్వే చేశారు
- నీతి ఆయోగ్ మీటింగ్‌లోనూ చర్చిస్తున్నరు.. వెంటనే స్పందించాలని డిమాండ్
- పోలవరం డెడ్‌స్టోరేజీ నుంచి నీటిని తీసుకెళ్లే లిఫ్ట్నూ ఆపాలని పీపీఏ, జీఆర్ఎంబీకి మరో లేఖ
హైదరాబాద్, వెలుగు:ఏపీ చేపడుతున్న గోదావరి బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టును వెంటనే ఆపేయాలని, ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశారని, ఇక ఏమాత్రం ఆలస్యం చేయవద్దని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)ను తెలంగాణ డిమాండ్ చేసింది. ఎప్పటినుంచో ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ బోర్డుకు ఫిర్యాదు చేసినా చేష్టలుడిగి చూస్తున్నదని, డ్యూటీలో ఫెయిల్ అయ్యారని మండిపడింది. జీబీ లింక్ ప్రాజెక్ట్ తమ దృష్టికి రాలేదని ఓ పక్కన బోర్డు చెబుతున్నా.. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులపై ఏపీ శరవేగంగా ముందుకెళ్తోందని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రాజెక్టుపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ జీఆర్ఎంబీ చైర్మన్‌కు ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్ ఘాటు లేఖ రాశారు. గత నెల 7న నిర్వహించిన బోర్డు 17వ మీటింగ్‌లో అసలు ప్రాజెక్టు ప్రతిపాదనల దశలోనే ఉందని ఏపీ ఈఎన్సీ చెప్పారని, కానీ, ఏపీ ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ఫీజిబిలిటీ స్టడీస్ పూర్తి చేసి రిపోర్ట్ సమర్పించేందుకు సిద్ధమైందనే వార్తలు వస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. దీనిపై నీతి ఆయోగ్ మీటింగ్‌లోనూ చర్చించనున్నట్టు తెలిసిందని చెప్పారు. దాంతోపాటు ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బొల్లాపల్లి రిజర్వాయర్‌తో ఏపీలోని పల్నాడు జిల్లాలో ముంపు గ్రామాలపైనా ఇప్పటికే సర్వే చేయించినట్టు తెలిసిందని తెలిపారు.
డెడ్‌స్టోరేజీ నీళ్లతో లిఫ్టా..
బనకచర్లతో పాటు పోలవరం ప్రాజెక్టులోని డెడ్‌స్టోరేజీ నీళ్లతో ఏపీ చేపట్టాలనుకుంటున్న లిఫ్ట్ ప్రాజెక్టునూ వెంటనే ఆపాలని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)తో పాటు జీఆర్ఎంబీకి ఈఎన్సీ జనరల్ మరో లేఖ రాశారు. గత నెల 8న జరిగిన పీపీఏ మీటింగ్‌లోనూ ఆ ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేశామని గుర్తు చేశారు. అయితే, పనులు ఆపేసినట్టు ఏపీ ప్రభుత్వం చెప్పిందని, కానీ, వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని ఈఎన్సీ జనరల్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే పోలవరం డెడ్‌స్టోరేజీ అయిన 35 మీటర్ల లెవెల్ నుంచి నీటిని తీసుకెళ్లే లిఫ్ట్‌ను చేపట్టనున్నట్ట వార్తలు వస్తున్నాయని పేర్కొన్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనల ప్రకారం డెడ్ స్టోరేజీ నుంచి నీళ్లను తీసుకెళ్లే ప్రాజెక్టులను చేపట్టరాదని, కానీ, ఏపీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఇలా డెడ్‌స్టోరేజీ నుంచి నీటిని తీసుకెళ్లడం వల్ల గోదావరి డెల్టా స్కీమ్‌పై పెను ప్రభావం పడడంతో పాటు.. తెలంగాణ ప్రాజెక్టులకూ నీళ్లు దక్కని పరిస్థితి ఏర్పడుతుందని ఆక్షేపించారు. ఈ విషయంలో వెంటనే స్పందించి లిఫ్ట్ పనులు చేపట్టకుండా ఏపీని అడ్డుకోవాల్సిందిగా పీపీఏ, జీఆర్ఎంబీ చైర్మన్లను ఈఎన్సీ అనిల్ కోరారు.
బోర్డు పట్టించుకోవట్లే..
ఇంత జరుగుతున్నా జీఆర్ఎంబీకి మాత్రం చీమకుట్టినట్టయినా లేదని లేఖలో ఈఎన్సీ జనరల్ ఆరోపించారు. వీఐపీ రిఫరెన్స్‌తో లేఖ రాసినా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు తన విధులు నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. కేంద్ర జలశక్తి శాఖ వీఐపీ రిఫరెన్స్‌తో కాన్సెప్ట్ నోట్‌ను బోర్డుకు పంపించినా మెంబర్ స్టేట్ అయిన తమకు చెప్పకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డుకు అప్పగించిన ప్రధాన డ్యూటీలు చేయడంలోనూ విఫలమైందన్నారు. గోదావరిగానీ.. కృష్ణాగానీ.. ఏదైనా కొత్త ప్రాజెక్టుకు సంబంధించి అప్రైజల్ వచ్చినప్పుడు.. అప్పటికే నిర్మించిన.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన నీటి వాటాల పంపిణీపై ప్రభావం పడకుండా చూడాల్సిన బాధ్యత బోర్డుపై ఉంటుందని, కానీ, దానిని బోర్డు విస్మరించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశారని, ఇకనైనా టైం వేస్ట్ చేయకుండా ఏపీ ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లకుండా అడ్డుకోవాలని బోర్డు చైర్మన్‌ను ఈఎన్సీ డిమాండ్ చేశారు. ల్యాండ్ సర్వే, టెండర్ల తదితర పనులు జరగకుండా చూడాలని పేర్కొన్నారు.