మేడిగడ్డ పునరుద్ధరణపై ఏబీ పాండ్యా కమిటీ!

మేడిగడ్డ పునరుద్ధరణపై  ఏబీ పాండ్యా కమిటీ!
  • కాఫర్​ డ్యామ్​ కట్టడమా.. రింగ్​ బండ్​ నిర్మించడమా అనే దానిపై స్టడీ
  • మరోవైపు బావర్, సీడబ్ల్యూపీఆర్​ఎస్ ప్రతినిధులతో అధికారుల సంప్రదింపులు
  • డయాఫ్రమ్​ వాల్​కు సహకరిస్తామన్న బావర్​ సంస్థ
  • జియోటెక్నికల్​ ఇన్వెస్టిగేషన్స్​ వరకు చేస్తామన్న  సీడబ్ల్యూపీఆర్​ఎస్​

హైదరాబాద్​, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. కొద్ది రోజుల కింద మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) తుది నివేదికను సమర్పించింది. ఈ నేపథ్యంలోనే సీడబ్ల్యూసీతోపాటు పలువురు నిపుణులతో సంప్రదింపుల అనంతరం బ్యారేజీల పునరుద్ధరణపై ప్రభుత్వం ఓ కమిటీ వేసినట్టు తెలిసింది. సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్​ ఏబీ పాండ్యా చైర్మన్​గా, ఈఎన్​సీ జనరల్​, రాష్ట్ర అధికారులు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ.. మేడిగడ్డలో కాఫర్​ డ్యామ్​ నిర్మించడమా లేదంటే రింగ్​బండ్​ లాంటి నిర్మాణాల ద్వారా పునరుద్ధరణకు సంబంధించిన చర్యలు చేపట్టడమా అనేది నిర్ణయించనున్నది. 

వరద ముప్పులో పంప్​హౌస్​లు

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్ద ప్రస్తుతం జియోటెక్నికల్​ ఇన్వెస్టిగేషన్లు చేయించేందుకు అనువైన పరిస్థితులు లేవని అధికారులు గుర్తించారు. అక్కడ ఇప్పటికే వరద మొదలు కావడం, ఇసుక మేటలు వేయడంతో టెస్టులు సాధ్యమయ్యే పరిస్థితి లేదని చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి పనులు చేయాలన్నా లోపలికి అప్రోచ్​ రోడ్లను నిర్మించాల్సి ఉంటుందని.. ప్రస్తుత వర్షాలు, వరదలతో ఆ పనులు సాధ్యం కావని అంటున్నారు. ఇక, చాన్నాళ్లపాటు ఇటు బ్యారేజీలు, అటు పంప్​హౌస్​ల మెయింటెనెన్స్​లేకపోవడంతో.. పూర్తి ఓ అండ్​ఎం పనులు చేయాలని అధికారులు, నిర్మాణ సంస్థలకు ఈఎన్​సీ జనరల్​ సూచించినట్టు తెలిసింది. గేట్లకు గ్రీజింగ్, చిన్న చితకా రిపేర్లు ఏవైనా ఉంటే చేపట్టాలని సూచించినట్టు సమాచారం. మరోవైపు పంప్​హౌస్​ల మెయింటెనెన్స్​ లేకపోవడంతో అవి కూడా మరోసారి ప్రమాదానికి గురయ్యే ముప్పు ఉందని అధికారులు భావిస్తున్నారు. పంప్​హౌస్​లకూ అవసరమైన ఓ అండ్​ ఎం పనులు చేయాల్సిందిగా నిర్మాణ సంస్థలకు సూచనలిచ్చినట్టు తెలిసింది. అన్నారం పంప్​హౌస్​ చుట్టూ రక్షణగా నిర్మిస్తున్న గోడ నిర్మాణం అసంపూర్తిగా ఉన్నది. వరదలు మొదలవుతున్న నేపథ్యంలో ఆ గోడ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, లేదంటే మరోసారి పంప్​హౌస్​ మునిగే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. వర్షాకాలం వచ్చేసిన నేపథ్యంలో వీలైనంత త్వరగా బ్యారేజీలు, పంప్​హౌస్​లకు సంబంధించిన అన్ని ఓ అండ్​ ఎం యాక్టివిటీస్​ను పూర్తి చేయాల్సిందిగా సూచించినట్టు తెలిసింది. 

రంగంలోకి బావర్​ సంస్థ

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కన్సల్టెంట్​గా వ్యవహరించిన అంతర్జాతీయ సంస్థ బావర్​ కూడా మేడిగడ్డ పునరుద్ధరణపై రంగంలోకి దిగుతున్నది. దీనిపై ఇప్పటికే బావర్​ సంస్థ ప్రతినిధులతో ఇరిగేషన్ శాఖ వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించినట్టు తెలిసింది. ఎన్​డీఎస్​ఏ చెప్పిన ప్రకారం రీహాబిలిటేషన్​ డిజైన్లను సూచించాలని బావర్​ సంస్థ ప్రతినిధులను అధికారులు కోరగా.. సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. బ్యారేజీ పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై మాత్రమే తాము సూచనలిస్తామని.. డయాఫ్రమ్​ వాల్​ వంటి నిర్మాణానికి సహకారం అందిస్తామని చెప్పినట్టు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో సంస్థ ప్రతినిధులు మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శిస్తారని ఇరిగేషన్​ ఆఫీసర్లు చెప్తున్నారు. ఇటు మేడిగడ్డ బ్యారేజీ కుంగినప్పటి నుంచి అక్కడ జియోటెక్నికల్​ ఇన్వెస్టిగేషన్స్​ నిర్వహించిన సెంట్రల్​ వాటర్​ పవర్​ రీసెర్చ్​ స్టేషన్​ (సీడబ్ల్యూపీఆర్​ఎస్​)తోనూ బ్యారేజీకి సంబంధించిన పూర్తి పునరుద్ధరణ పనులపై అధికారులు చర్చించినట్టు తెలిసింది. సీడబ్ల్యూపీఆర్​ఎస్​కూడా తాము ఇన్వెస్టిగేషన్ల వరకు మాత్రమే చేస్తామని, మిగతా విషయాల్లో జోక్యం చేసుకోబోమని చెప్పినట్టు సమాచారం.