జమిలీ ఎన్నికలు రాజ్యాంగబద్ధమే.. పార్లమెంటరీ కమిటీకి తెలిపిన మాజీ సీజేఐలు

జమిలీ ఎన్నికలు రాజ్యాంగబద్ధమే.. పార్లమెంటరీ కమిటీకి తెలిపిన మాజీ సీజేఐలు
  • ఎలక్షన్ ​కమిషన్​కు విశేష అధికారాలపై ఆందోళన
  • రాజ్యాంగం ఇచ్చిన ఐదేండ్ల కాలపరిమితితో సవాళ్లు

న్యూఢిల్లీ: వన్ నేషన్, వన్ ఎలక్షన్ ​బిల్లు రాజ్యాంగబద్ధమేని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు సమర్థించారు. ఇది రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించదని స్పష్టం చేశారు. అలాగే ఈ బిల్లులోని కొన్ని అంశాలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదే సమయంలో దీన్ని అమలు పరచడంలో పలు సవాళ్లు ఉన్నాయన్నారు. ఎన్నికల సంఘానికి ఇచ్చిన విశేష, విస్తృత అధికారాలు ఆందోళకరమని తెలిపారు. 

ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యంగం ఇచ్చిన ఐదేండ్ల కాలపరిమితి ప్రశ్నార్థకంగా మారుతున్నదన్నారు. అలాగే ఇది చిన్న రాజకీయ పార్టీలకు నష్టం కలిగిస్తుందని తెలిపారు. ‘వన్​నేషన్, వన్​ఎలక్షన్’ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్​డి.వై. చంద్రచూడ్, జస్టిస్​రంజన్ గోగోయ్, జస్టిస్​యు.యు. లలిత్, జస్టిస్ జె.ఎస్. కేహర్ తో కూడిన హౌస్ ప్యానెల్ తమ అభిప్రాయాలను సమర్పించింది. ఈ బిల్లు రాజ్యాంగబద్ధమేనని.. లోక్‌‌సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికలను విడిగా నిర్వహించాలని రాజ్యాంగం ఎప్పుడూ పేర్కొనలేదని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టంచేశారు. 

ఎన్నికల సంఘానికి ఇచ్చిన అపారమైన అధికారాలపై జస్టిస్​చంద్రచూడ్ తోపాటు జస్టిస్ గోగోయ్ ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలన్నారు. లేదంటే శాసనసభల కాలపరిమితిని ఐదేళ్ల కంటే పెంచే లేదా తగ్గించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇతర సవాళ్లు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉందని.. బిల్లులో ఎన్నికల సంఘం అధికారాలను నిర్వచించి, నియంత్రణలు విధించాలని జస్టిస్​ చంద్రచూడ్ సూచించారు. జస్టిస్ యు.యు.లలిత్ ఎన్నికలను ఒకేసారి కాకుండా దశలవారీగా నిర్వహించాలని అభిప్రాయపడ్డారు.

పెద్ద పార్టీలకు మేలు చేయోచ్చు..

వన్​నేషన్, వన్​ఎలక్షన్​ వల్ల చిన్న, ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుందని జస్టిస్​ చంద్రచూడ్​ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్థిక, అంగ బలం కలిగిన జాతీయ పార్టీల ముందు అవి వెనుకబడతాయని ఈ లోపాన్ని సరిచేయాలని సూచించారు.

మధ్యంతర ఎన్నికలోనే అభివృద్ధికి బ్రేక్! 

మధ్యంతర ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ఏడాది లేదా అంతకంటే తక్కువ కాలం పాలిస్తే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్  కారణంగా అభివృద్ధి పనులు చేయలేదని కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. వన్​నేషన్ ​వన్ ఎలక్షన్​ బిల్లుపై చర్చించేందుకు జస్టిస్​ చంద్రచూడ్, జస్టిస్ కేహర్ జులై 11న బీజేపీ ఎంపీ పి.పి. చౌదరి నేతృత్వంలోని జేపీసీ ముందు హాజరుకానున్నారు.