రాజ్యసభ చైర్మన్​కు..కొత్త చట్టాల నివేదికలు

రాజ్యసభ చైర్మన్​కు..కొత్త చట్టాల నివేదికలు

న్యూఢిల్లీ: ఐపీసీ, సీఆర్​పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ లో మార్పులకు సంబంధించిన బిల్లుల నివేదికలను పార్లమెంటరీ ప్యానెల్ శుక్రవారం రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్​ఖడ్​కు అందజేసింది. ఈ విషయాన్ని ఉప రాష్ట్రపతి సెక్రటేరియెట్ ట్విట్టర్​లో వెల్లడించింది. స్టాండింగ్ కమిటీ చైర్మన్ బ్రిజ్ లాల్.. పార్లమెంట్​లోనే ధన్​ఖడ్​కు మూడు రిపోర్టులు అందజేశారు. ఇండియన్ పీనల్ కోడ్​తో పాటు బ్రిటిష్ హయాం నాటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్​ను కేంద్రం తొలగించనుంది. 

వాటి స్థానంలో కొత్త బిల్లులు రూపొందించి లోక్​ సభలో ఇప్పటికే ప్రవేశపెట్టింది. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో ‘ది భారతీయ న్యాయ సంహిత – 2023’ బిల్లును తీసుకొచ్చింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో ‘ది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత – 2023’ బిల్లును, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ‘ది భారతీయ సాక్ష్య బిల్లు – 2023’ను రూపొందించింది.