అయోధ్య కరసేవలో పాల్గొనడం నా పూర్వ జన్మ సుకృతం

అయోధ్య కరసేవలో పాల్గొనడం నా పూర్వ జన్మ సుకృతం

అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కోసం ప్రపంచంలోని హిందూ సమాజమంతా ఎదురు చూస్తోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఎంతో మంది దీక్షలు తీసుకున్నారని చెప్పారు. రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం దేవాలయాలన్నీ ముస్తాబయ్యాయని తెలిపారు. 

ఇంటింటా రామ నామ స్మరణ మారుమోగుతోందని బండి సంజయ్ అన్నారు. మధ్యాహ్నం జరిగే రామ మందిర ప్రాణ ప్రతిష్ట ద్రుశ్యాన్ని వీక్షించి తరించండని సూచించారు. రామ మందిర నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని చెప్పారు.ఈరోజు ప్రతి హిందువు తమ తమ ఇండ్ల ముందు 5 రామ జ్యోతులు వెలిగించండని కోరారు. 

ప్రధాని పిలుపు మేరకు దేశవ్యాప్తంగా టపాసులు పేల్చి దీపావళి సంబురాలు చేసుకునేందుకు సిద్ధం కవాలని సూచించారు. సాయంత్రం కరీంనగర్ లోని తెలంగాణ చౌరస్తాలో దీపావళి సంబురాలు చేసుకోబోతున్నామని చెప్పారు. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ఆర్టిస్ట్ వెంకటేశ్ రూపొందించిన సైకత అయోధ్య రామ మందిరాన్ని వీక్షించాలని కోరారు. అయోధ్య కరసేవలో పాల్గొనడం తన పూర్వ జన్మ సుకృతమని బండి సంజయ్ తెలిపారు.