
భారతదేశం విభిన్న కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, జాతుల సమాహారం అయినప్పటికీ ఏకత్వ భావన కలిగి ఉంది. భారత రాజ్యాంగం సమానత్వానికి, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. అయినప్పటికీ లౌకిక వాదం పట్ల గత కొంతకాలంగా చర్చ నడుస్తోంది. గతంలో కేంద్ర ప్రభుత్వం సామ్యవాదం, లౌకికవాదాన్ని తొలగించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ముఖ్యంగా రిజర్వేషన్లపై కూడా చర్చ జరుగుతోంది. మతం మారితే రిజర్వేషన్ రద్దు అని కోర్టులు పేర్కొన్నాయి. మరోవైపు ముస్లిం రిజర్వేషన్ల అంశం తుది తీర్పు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. సిక్కు లేదా బౌద్ధమతం కాకుండా ఇతర మతాలలోకి మారిన దళితులకు షెడ్యూల్డ్ కుల హోదా ఇవ్వాలా వద్దా అనే దానిపై భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో కమిషన్ వేశారు. వాస్తవంగా భారతదేశంలో మతం కంటే కులమే అనేక రంగాల్లో ప్రభావితం చేస్తుంది. కానీ, రాజకీయంగా మతాన్ని వాడుకుంటున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం అందరూ సమానం.
అసమానతలు ఉన్న కారణంగా కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారు. వీటికి వెనకబాటుతనమే గీటురాయి. ఈ క్రమంలో వేల సంవత్సరాల నుంచి విద్యకు దూరమై అస్పృశ్యత, అంటరానితంతో అణచివేతకు గురైన వర్గాలకు రిజర్వేషన్ కల్పించారు. ఇలాంటి సామాజిక నేపథ్యం కలిగిన ఏ కులమైన రిజర్వేషన్ పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ రిజర్వేషన్ల లక్ష్యం నెరవేరకపోగా అవి దారి తప్పుతున్నాయి. దేశంలో 90శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలు ఇంకా సామాజిక, ఆర్థిక, రాజకీయ స్రవంతికి ఆమడదూరంలోనే ఉన్నారు. వీరికి కల్పించిన మొత్తం రిజర్వేషన్ 50 శాతమే. అగ్రవర్ణ పార్టీలు 10 శాతం లేని అగ్రకుల పేదలకు వారి జనాభాకు మించి విద్య , ఉద్యోగాలలో 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కల్పించుకున్నాయి.
కేంద్రం వద్ద బిల్లులు
ఈ దేశంలో మెజార్టీ వర్గమైన బీసీలు రిజర్వేషన్ల విషయంలో చాలాకాలంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో ఆ వర్గాలు రిజర్వేషన్ పెంపుకోసం డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక ఆర్థిక, విద్య , రాజకీయ, కుల సర్వే నిర్వహించింది. అనంతరం బీసీల జనాభా 56 శాతంగా తేల్చారు. దీనికి అనుగుణంగా వారికి 42 శాతం విద్య, ఉద్యోగ, స్థానిక రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపారు. మరోవైపు ఇటీవల తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 30 వరకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో పంచాయతీరాజ్ చట్టం 2018లో రిజర్వేషన్ విధానాన్ని మార్పు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఇది ఇప్పుడు గవర్నర్ ఆమోదించాల్సి ఉంది. దీన్ని రాష్ట్రపతి పరిశీలనకు పంపినట్టు సమాచారం.
మత ప్రాతిపదిక రిజర్వేషన్లు లేవు
బీజేపీ రాజకీయ నాయకులు 42 శాతం రిజర్వేషన్లులో ముస్లింలు కలిపారని తొండి వాదన మొదలుపెట్టారు. ముస్లింలను బీసీ రిజర్వేషన్ నుంచి తొలగిస్తే బిల్లు మేం పాస్ చేయిస్తామని తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ కేంద్ర మంత్రులు అనడం హాస్యాస్పదం. లౌకిక ప్రజాస్వామ్య దేశంలో బీసీ రిజర్వేషన్ విషయాన్ని మత రిజర్వేషన్లుగా చిత్రీకరిస్తూ తప్పుదారి పట్టిస్తున్నారు. అసలు భారతదేశంలో మత రిజర్వేషన్లకు అవకాశం లేదు. కేవలం వెనుకబాటుతనమే రిజర్వేషన్లకు గీటురాయిగా భారత రాజ్యాంగం పేర్కొన్నది. అయినప్పటికీ బీజేపీ నాయకుల మాటలు రిజర్వేషన్లు అంశంపై చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే గుజరాత్, ఉత్తరప్రదేశ్ , మహారాష్ట్రలోనూ ముస్లింలు బీసీలోనే ఉంటూ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. ఇదంతా చూస్తే రాజకీయ నాయకులు బీసీ రిజర్వేషన్లను ఓటు బ్యాంకు సాధనంగా వాడుకుంటూ బీసీల నోట్లో మట్టి కొడుతున్నారని మేధావుల వాదన.
ముస్లిం రిజర్వేషన్లపై చర్చ
కర్నాటక తర్వాత ప్రస్తుతం తెలంగాణలోనూ ముస్లిం రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఇక్కడ కూడా ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక బహిరంగ సభలో ప్రకటించారు. ఆయన మాటలకు ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ బీజేపీ మత రాజకీయాలు చేస్తోందన్నారు. తెలంగాణలో ముస్లింలకు కులం ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తున్నారు. కానీ, మతం ఆధారంగా ఈ రిజర్వేషన్లు వర్తింపచేస్తున్నారని చెప్పడం ఒక పెద్ద అబద్ధం అని, ముస్లింలను శత్రువులుగా చిత్రీకరిస్తున్నారని పేర్కొన్నాడు. వాస్తవంగా తెలంగాణలో కొన్ని ముస్లిం కులాలు బీసీ–-బి కింద రిజర్వేషన్ పొందుతున్నారు. మరికొన్ని ముస్లిం కులాలు ప్రత్యేకంగా బీసీ–-ఈ కింద 4 శాతం, ఈ డబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ అమలవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2007 వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో 14 ముస్లిం కులాలను బీసీ–ఈ కింద చేర్చి 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. దాన్ని అప్పటి హైకోర్టు కొట్టివేసింది. అనంతరం ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు తుది తీర్పు వచ్చేంతవరకు ఆ 4 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని చెప్పింది. అంటే ముస్లిం రిజర్వేషన్ల పట్ల ఇంకా తుదితీర్పు రావాల్సి ఉంది. అప్పుడే మతపరమైన రిజర్వేషన్లు ఉంటాయా లేదా అన్నది స్పష్టత వస్తుంది. అప్పటివరకు వారు బీసీలేనని అర్థమవుతుంది. కాకా కలేల్కర్ కమిషన్, బీపీ మండల కమిషన్ లోని బీసీ కులాల్లో ముస్లింలు ఉన్నారు.
సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వాలి
ప్రస్తుతం జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాలలో రిజర్వేషన్ లేదా రిప్రెజెంటేషన్ కల్పించాలి. సమానత్వ సాధనలో భాగంగా ఈ విషయాన్ని రాజ్యాంగం సైతం నొక్కి చెబుతున్నది. రాష్ట్రాలు రిజర్వేషన్లు కల్పించుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు స్పష్టతనివ్వాలి. మారుతున్న కాలానికనుగుణంగా ప్రజలకు లబ్ధి చేకూర్చే ప్రభుత్వ విధాన నిర్ణయాలను కోర్టులు స్వాగతించాలి. అదేవిధంగా మత రిజర్వేషన్ల పట్ల కూడా స్పష్టతనివ్వాలి. మరోవైపు కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలు తమ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పెంచుకునేవిధంగా ఒక చట్టం తీసుకురావాలి. రిజర్వేషన్ల విషయంలో మతాల మంటకు దారి తీయవద్దు. హిందూ, ముస్లిం సమస్యగా మార్చవద్దు. పౌరుల సామాజిక ఆర్థిక అభివృద్ధికి పెద్దపీటవేయాలి. రాజ్యాంగం కూడా అదే కోరుకుంటుంది.
జనాభా వాటా ప్రకారం రిజర్వేషన్లు..
విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులకు కల్పిస్తోన్న రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని మూడు దశాబ్దాల కిందట సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అసాధారణమైన పరిస్థితులలో ఈ 50 శాతం పరిమితిని ఉల్లంఘించవచ్చని ఇందిరా సహాని కేసులో స్పష్టం చేసింది. రాజ్యాంగంలో ఎక్కడా కూడా రిజర్వేషన్లపై పరిమితి లేదు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించిన బిల్లును పార్లమెంటులో చట్టం చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఇది కోర్టు తీర్పుకు ఉల్లంఘన అంటూ కేంద్రం దాటవేస్తోంది. మత రిజర్వేషన్ అంటూ కొందరు మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
- సంపతి రమేష్ మహారాజ్,
సోషల్ ఎనలిస్ట్