ముందస్తు ఎన్నికలకు పార్టీలు సిద్ధం..!

 ముందస్తు ఎన్నికలకు పార్టీలు సిద్ధం..!

రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రోజురోజుకూ పెరుగుతోంది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సై అంటే సై అంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు తప్పవన్న భావన కలుగుతుంది.  మోడీ సర్కారుపై అగ్గిమీద గుగ్గిలమవుతున్న సీఎం కేసీఆర్.. దమ్ముంటే ముందస్తు ఎన్నికల డేట్ ఫిక్స్ చేయాలని బీజేపీకి సవాల్ విసిరారు. దానిపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ అంటూ ప్రతి సవాల్ విసిరారు. మరో ప్రతిపక్షం కాంగ్రెస్ సైతం ముందస్తు ఎన్నికలకు సిద్ధమన్న సంకేతాలిస్తోంది. ఇలా పార్టీలన్నీ  ముందస్తుకు సిద్ధమవుతుండటంపై పొలిటికల్ సర్కిళ్లలో జోరుగా చర్చ నడుస్తోంది. షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలకు 2023 నవంబర్ వరకు గడువుంది. ఈ లెక్కన అటు ఇటుగా దాదాపు 15నెలల సమయం ఉన్నా అంతకన్నా ముందే పార్టీలు పోల్ వార్ కు రెడీ అవడం ఆసక్తికరంగా మారింది. 

ముందస్తుకు ప్రతిపక్షాలు సిద్ధం..!

2014లో తొలిసారి అధికారం చేపట్టిన కేసీఆర్ గడువుకు 9 నెలల ముందే అసెంబ్లీని రద్దు చేశారు. ఈసారి కూడా ఆయన అదే వ్యూహాన్ని అమలుచేస్తారని ప్రతిపక్షాల అనుమానం.  అందుకే ఒకవైపు బీజేపీని రెచ్చగొడుతూనే మరోవైపు ఎన్నికల తేదీ ప్రకటిస్తే అసెంబ్లీ రద్దు చేస్తానంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి కేసీఆర్ పాలనపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి నెలకొందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆసరా ఫించన్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఉద్యోగ నియామకాలు, దళిత బంధు తదితర పథకాల అమలుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో వాటి నుంచి జనం దృష్టి మరల్చేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు వ్యూహాన్ని తెరపైకి తెచ్చారన్నది రాజకీయ పండితుల అభిప్రాయం. అయితే కేసీఆర్ గురించి తెలిసిన ప్రతిపక్ష పార్టీలు ఆయనకు ధీటుగా జవాబిచ్చేందుకు ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముందస్తు వచ్చినా, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేందుకు సై అంటున్నాయి.

పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టి

రాష్ట్రంలో అధికారం చేపట్టాలని కంకణం కట్టుకున్న బీజేపీ అందుకు అనుగుణంగా కార్యచరణ రూపొందించి ముందుకు సాగుతోంది. సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్తారన్న బీజేపీ అధినాయకత్వానికి ఇప్పటికే సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ నాయకత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. వీలైనప్పుడల్లా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది. మరోవైపు రాష్ట్రంలో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపైనా బీజేపీ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ వేదికగా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ నిర్వహించారన్నది పొలిటికల్ అనలిస్టుల అభిప్రాయం. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందే జూన్ 30, జులై 1వ తేదీల్లో బీజేపీ జాతీయ నేతలు 119 నియోజకవర్గాల్లో రెండు రోజుల పాటు పర్యటించారు. బీజేపీ అనుబంధ మోర్చా నాయకులతో సమావేశమై పార్టీ స్థితిగతుల గురించి ఆరా తీశారు. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ బలబలాలు, క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి రిపోర్టు సిద్ధం చేశారు. ఈ మధ్యనే పార్టీ హైకమాండ్ మూడు మినహా మిగిలిన 14 పార్లమెంటు స్థానాలను క్లస్టర్లుగా విభజించి కేంద్ర మంత్రులను ఇంఛార్జులుగా నియమించింది. వారంతా ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సైతం అన్ని కమిటీలతో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ ముఖ్యనేతల్లో ఒకరు ఒక్కో నియోజవర్గంలో 10 రోజులు ఉండి క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావాలని సూచించారు. నేతలు కార్లలో తిరగకుండా బైక్ ర్యాలీలు నిర్వహించి గ్రౌండ్ లెవల్ లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆదేశించారు. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఆగస్టు 2 నుంచి మూడో విడత పాదయాత్రకు సన్నద్ధమవుతున్నారు. ఈ పరిణామాలన్నింటినీ చూస్తే బీజేపీ రాష్ట్రంలో ముందస్తు నగారా మోగినా..షెడ్యూల్ ప్రకారం  ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండాలని డిసైడైనట్లు తెలుస్తోంది. 

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం

కేసీఆర్ కు ముందస్తుకు వెళ్లే దమ్ము లేదంటూనే కాంగ్రెస్ సైతం ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమంటోంది. షెడ్యూల్ కు ముందే ఎన్నికలు వచ్చినా ఇబ్బంది లేకుండా వ్యూహరచనలో నిమగ్నమైంది. నిజానికి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం, గ్రూపు రాజకీయాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో హైకమాండ్ మొదట సీనియర్లను బుజ్జగించే పనిలో పడింది. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ రెండు రోజుల పాటు సీనియర్లతో భేటీ అయ్యారు. మరోవైపు ఇతర పార్టీల నుంచి నేతల వలసలను ప్రోత్సహిస్తున్నారు. గ్రౌండ్ లెవల్ లో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాల్లో ఉన్న కాంగ్రెస్ వరంగల్ లో నిర్వహించిన రాహుల్ సభలో రైతు డిక్లరేషన్ ప్రకటించింది. అధికారంలోకి వస్తే  రైతుల పక్షాన నిలబడతామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఈ మూడింటిపై డిక్లరేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఎలా ముందుకు సాగుతామన్నది చెప్పేందుకు రెడీ అవుతోంది. పనిలో పనిగా ధరణి లోపాలు, రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని బయటపెట్టడంపైనా దృష్టి సారించింది. 

వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే

ఇదిలా ఉంటే ముందుస్తు ఎన్నికలకు సిద్ధమన్న కేసీఆర్ వ్యాఖ్యలపై సొంతపార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. నిజానికి నిన్న మొన్నటి వరకు కూడా పార్టీలో ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. ఎలక్షన్లకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. కానీ ఆ తర్వాత పార్టీలో నెలకొన్న పరిస్థితులు ముఖ్యంగా ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, కొందరు నాయకులు పార్టీని వీడటంతో వ్యూహం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ముందస్తు ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీ మంత్రులు,ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా ఎలాంటి సంకేతాలు లేవని సమాచారం. కేసీఆర్ 2018లో ముందస్తుకు వెళ్లారు. అయితే అప్పటి రాజకీయ పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఒకవేళ ఆరు నెలల్లోపు ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించకపోతే ప్రభుత్వంపై వ్యతిరేకత ఇంకా పెరిగే అవకాశముంది. అందుకే అసెంబ్లీ రద్దైన వెంటనే ఎలక్షన్లు రావాలి. ఆ కారణంగానే ముందుగా ఎన్నికల డేట్ ఫిక్స్ చేయండి అప్పుడు అసెంబ్లీ రద్దు చేస్తానని కేసీఆర్ చెబుతున్నారని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. నిజానికి ప్రభుత్వం రద్దైన తర్వాత అన్ని పరిస్థితులను బేరీజు వేసుకుని ఎలక్షన్ కమిషన్ ఎన్నికల తేదీలను నిర్ణయిస్తుంది. ఈ విషయం తెలిసినా తేదీలు ఖరారు చేయండంటూ బాల్ ను బీజేపీ కోర్టులోకి విసిరి డ్రామాలాడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్లు జరిగినా టీఆర్ఎస్ కు నష్టం తప్పదన్నది రాజకీయ పండితుల మాట. అందుకే వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ముందస్తు ఎన్నికల అంశాన్ని  తెరపైకి తెచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.