సాగర్‌లో ఎవరిని నిలబెడదాం? పార్టీల కసరత్తు

సాగర్‌లో ఎవరిని నిలబెడదాం? పార్టీల కసరత్తు
  • సాగర్​పై టీఆర్ఎస్​లో కసరత్తు
  • రెడ్డి, యాదవ కులంలో ఎవరు బెటర్ అని  ఆరా
  • దుబ్బాక రిజల్ట్ రిపీట్ చేయాలన్న పట్టుదలతో బీజేపీ 
  • మూడు నెలలుగా సెగ్మెంట్​లో కాంగ్రెస్​ అభ్యర్థి జానారెడ్డి ప్రచారం

హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్  ఉప ఎన్నికపై ప్రధాన రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఫీల్డ్ కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. బీసీ, రెడ్డి కులాల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశంపై టీఆర్​ఎస్​ మల్లగుల్లాలు పడుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన తర్వాత తన అభ్యర్థిని ఎంపిక చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిగా మాజీ మంత్రి జానారెడ్డి పేరును ప్రకటించింది. ఆయన గత మూడు నెలలుగా అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉంటూ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. 
 

అభ్యర్థి కోసం టీఆర్​ఎస్​ అన్వేషణ
కాంగ్రెస్  అభ్యర్థి జానారెడ్డిని దీటుగా ఎదుర్కొనే అభ్యర్థి కోసం టీఆర్ఎస్ ఆరా తీస్తోంది. యాదవ, రెడ్డి కులంలో ఎవరికి టికెట్ ఇవ్వాలో సీఎం కేసీఆర్  ఆలోచిస్తున్నట్లు టీఆర్​ఎస్​ లీడర్లు చెప్తున్నారు. నియోజకవర్గంలో యాదవ కులం ఓట్లు దాదాపు 40 వేలు ఉన్నాయి. మరోవైపు సెగ్మెంట్ లో రెడ్డి లీడర్లు బలంగా ఉన్నారు. దీంతో ఏ కులం వాళ్లకు టికెట్ ఇస్తే బాగుంటుదని నిఘా వర్గాల నుంచి కేసీఆర్​ రిపోర్టు తెప్పించుకున్నట్టు తెలిసింది. యాదవ కులం నుంచి నోముల నర్సింహయ్య కొడుకు భగత్​తో పాటు  గురువయ్య యాదవ్, రంజిత్ యాదవ్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్డి కులం నుంచి ఎమ్మెల్సీ తేరపు చిన్నపురెడ్డి, ఎంసీ కోటిరెడ్డి రేసులో ఉన్నారు.

భగత్​కు  టికెట్టా? బుజ్జగింపా?
నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు  నోముల నర్సింహయ్య కొడుకు భగత్​ ఇంట్రెస్ట్​ చూపుతున్నారు. ఆయనకు టికెట్​ ఇవ్వాలా లేక బుజ్జగించాలా అనే దానిపై టీఆర్​ఎస్​ నాయకత్వం చర్చలు జరుపుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో సోలిపేట రామలింగారెడ్డి భార్యకు టికెట్ ఇచ్చి సాగర్ లో నోముల ఫ్యామిలీకి టికెట్ ఇవ్వకపోతే విమర్శలు వస్తాయని లీడర్లు చెప్తున్నారు.  

 

త్వరలో బీజేపీ భారీ బహిరంగ సభ
నాగార్జున సాగర్​లోనూ దుబ్బాక రిజల్ట్ రిపీట్ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే పార్టీ తరఫున ఎన్నికల ఇన్​చార్జులుగా మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్ రావును బీజేపీ రాష్ట్ర నాయకత్వం నియమించింది. మండల స్థాయిలో కూడా ఇన్​చార్జుల నియామకం పూర్తి చేసింది. బీజేపీ లీడర్లు జనంలో తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల​ఇన్​చార్జ్​ తరుణ్ చుగ్ నాగార్జునసాగర్  సెగ్మెంట్​లో పర్యటించి  ఎన్నికలకు కేడర్​ను సమాయత్తం చేశారు. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున టికెట్ ఆశిస్తున్న వారి జాబితా పెద్దగానే ఉండడంతో వారందరిని ఇటీవలే పార్టీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్ హైదరాబాద్ కు పిలిపించి మాట్లాడారు. అభ్యర్థి ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని, దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. ప్రధానంగా రెడ్డి, యాదవ కులాల్లో ఒకరికి టికెట్ ఇవ్వాలని పార్టీ యోచిస్తున్నట్టు తెలిసింది. అది కూడా టీఆర్ఎస్ ప్రకటించే అభ్యర్థి కులం ఆధారంగానే ఫైనల్ డెసిషన్  తీసుకోనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామని వారు చెప్తున్నారు. త్వరలోనే సాగర్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, ఎన్నికల శంఖాన్ని పూరించేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ఇప్పటికే గుర్రంపోడు గిరిజనుల తరఫున ఆందోళన చేసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ తన ఉనికిని నిలబెట్టుకుంది.  

 

భవిష్యత్తు కోసం కాంగ్రెస్  పోరాటం
నాగార్జుసాగర్​లో గెలిస్తే పూర్వ వైభవం వస్తుందని కాంగ్రెస్​ ధీమాగా ఉంది. అందుకోసమే కొత్త పీసీసీ  చీఫ్ ఎంపికను ఏఐసీసీ వాయిదా వేసింది. సాగర్ అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఆయన సుమారు మూడు నెలలుగా సెగ్మెంట్ లో ఉంటూ తన బలాన్ని పెంచుకునే పనిలో ఉన్నారు. ప్రతి గ్రామంలో పర్యటిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ కు చెందిన కేడర్ ను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి,  పీసీసీ చీఫ్​ పదవి ఆశిస్తున్న కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తమ సత్తా  చూపించుకునేందుకు జానారెడ్డి గెలుపు కోసం ప్రయత్నించాల్సి ఉంటుందని పార్టీలో చర్చ జరుగుతోంది.