హింసను రెచ్చగొట్టడమే బీజేపీ పని: ఖర్గే

హింసను రెచ్చగొట్టడమే బీజేపీ పని: ఖర్గే
  • కేంద్రానిది విభజించు..పాలించు సిద్ధాంతం
  • మోదీ స్పీచ్​పై ప్రతిపక్షాల ఫైర్ 
  • డెమోక్రసీ, రాజ్యాంగమే దేశానికి రక్షణ కవచాలు: ఖర్గే

న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో హింసను రెచ్చగొడ్తున్నదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఫైర్ అయ్యారు. దేశాన్ని మతం పేరుతో విభజిస్తున్నదని విమర్శించారు. విద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ ‘‘విభజన భయానక దినోత్సవం” జరుపుకుంటున్నదని అన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్​క్వార్టర్స్​లో ఆయన జెండా ఎగురవేశారు. ఈ ప్రోగ్రామ్​కు యూపీఏ ప్రెసిడెంట్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడారు. ‘‘తమ స్వార్థ ప్రయోజనాల కోసమే సంఘ్ పరివార్ ఎజెండా అయిన విభజించు.. పాలించు సిద్ధాంతాన్ని కేంద్రం అమలు చేస్తున్నది. భిన్నత్వంలో ఏకత్వం అనేది మన బలం. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనని వారు కాంగ్రెస్ పార్టీకి సలహాలు ఇస్తున్నరు. వారి విద్వేషపూరిత రాజకీయాలు దేశాన్ని రెండు ముక్కలు చేశాయన్నది చారిత్రక సత్యం’’ అని ఖర్గే అన్నారు. డెమోక్రసీ, కానిస్టిట్యూషన్ అనేవి దేశ ప్రజలకు అతిపెద్ద రక్షణ కవచాలు అని.. ప్రతిపక్ష పార్టీలు డెమోక్రసీకి ఆక్సిజన్​లాంటివని చెప్పారు. కాగా, ప్రధాని మోదీ స్పీచ్ దేశాన్ని విభజించే కుట్రకు దారితీసేలా ఉందని అపోజిషన్ పార్టీలు మండిపడ్డాయి. మోదీ చేసిన ‘‘కమ్యూనల్ సివిల్ కోడ్’’ కామెంట్లు..   అంబేద్కర్​ను అవమానించేలా ఉన్నాయని కాంగ్రెస్ నేత జైరారం రమేశ్, సీపీఐ నేత డి. రాజా, ఆర్జేడీ నేత మనోజ్ ఝా విమర్శించారు. ఎర్రకోట వేదికగా మోదీ దుర్మార్గపు ఆలోచనలు బయటపెట్టారని విమర్శించారు.