- కేంద్రాన్ని ప్రశ్నించిన బీజేపీ నేత రవీంద్ర నాయక్
న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం వంటి చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని చెబుతున్న బీజేపీ.. తెలంగాణను దోచుకున్న కేసీఆర్ కుటుంబంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ప్రశ్నించారు. అసలు అవినీతి నుంచి కేసీఆర్ ను కేంద్రం ఎందుకు కాపాడుతోందని ప్రశ్నించారు.
మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరాన్ని కేసీఆర్ ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధానమంత్రి మోదీ, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ తప్పదని కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడారని గుర్తు చేశారు. లిక్కర్ స్కాంలో కవితను ఎందుకు వదిలేసారో ప్రజలకు చెప్పాలన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని ప్రజలు నమ్ముతున్నారన్నారు.
కేసీఆర్ లేదా ఆయన పార్టీకి మద్దతిచ్చే ఏ రాజకీయ పార్టీలకైనా పుట్టగతులు ఉండవన్నారు. ఇది మొన్నటి ఎన్నికల్లో తేలిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజాధనాన్ని కాళేశ్వరం రూపంలో కేసీఆర్ మళ్లించిన తీరును కాగ్ రిపోర్ట్ లో వెల్లడించిందని, ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం జ్యూడిషియల్ ఎంక్వైరీ వేయడం సంతోషకరమన్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోవడంలో ఉపేక్షించొద్దని సూచించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి నల్గొండ సీటు ఆశిస్తున్నట్లు తెలిపారు.
