టెట్​లో 84% ఫెయిల్ .. ఓఎంఆర్ ​షీట్లు ఆన్​లైన్​లో పెట్టాలని డిమాండ్​

టెట్​లో 84%  ఫెయిల్ .. ఓఎంఆర్ ​షీట్లు ఆన్​లైన్​లో పెట్టాలని డిమాండ్​
  • దారుణంగా తగ్గిన పేపర్​ 2 ఉత్తీర్ణత శాతం
  • పేపర్ 1లో 36%.. పేపర్ 2 లో 15%  మాత్రమే క్వాలిఫై 
  • డీఎస్సీ ముందు టెట్ టఫ్​గా ఇవ్వడంపై అభ్యర్థుల్లో ఆందోళన 

హైదరాబాద్, వెలుగు: టీఎస్​టెట్ ఫలితాల్లో ఈసారి ఉత్తీర్ణత శాతం బాగా పడిపోయింది. పేపర్1లో 36.89% మంది క్వాలిఫై కాగా, పేపర్ 2 లో 15.30 శాతం అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి పేపర్ 2 లో 84.70 శాతం మంది అభ్యర్థులు ఫెయిల్​ అయ్యారు. ఈ నెల15న జరిగిన టీచర్​ ఎలిజిబిలిటీ టెస్ట్​ (టెట్) రిజల్ట్ ను ఎస్​సీఈఆర్టీ అధికారులు బుధవారం వెబ్ సైట్​లో పెట్టారు.

పేపర్ 2 ఫలితాల్లో భారీ మార్పులు 

గతంతో పోలిస్తే టెట్​క్వాలిఫై పర్సంటేజీలో భారీగా మార్పులొచ్చాయి. పేపర్ 2 లో అత్యల్పంగా 15.30% మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. గతేడాది నిర్వహించిన టెట్​లో 49.64% మంది క్వాలిఫై అయ్యారు. అంటే ఏకంగా 34.34% తగ్గింది. మ్యాథ్స్ అండ్ సైన్స్​లో  గతేడాది 57.67% మంది క్వాలిఫై కాగా.. ఈసారి కేవలం 18.66% మంది అర్హత సాధించారు. సోషల్ స్టడీస్​లో గతేడాది 40.41% మంది అర్హత సాధించగా.. ఈసారి కేవలం 11.47% మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. 

అభ్యర్థుల్లో ఆందోళన...

రాష్ట్రంలో 5089 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇటీవలే రిలీజైంది. డీఎస్సీ రాయాలంటే టెట్​ఉత్తీర్ణత తప్పనిసరి. అయితే బుధవారం విడుదలైన టెట్​ఫలితాల్లో చాలామంది అభ్యర్థులు టెట్ క్వాలిఫై కాలేదు. రెండు పేపర్లు కలిపి మొత్తం 4,13,629 మంది రాయగా, కేవలం 1,11,562 మంది మాత్రమే అర్హత సాధించారు. కేవలం 26.97% మంది క్వాలిఫై అయ్యారు. డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చినా.. చాలామంది టెట్ క్వాలిఫై కాకపోవడంతో పరీక్ష రాసే అవకాశం లేకుండా పోయింది. చాలామంది అభ్యర్థులు తమ రిజర్వు కేటగిరీలో ఒకటీ, రెండు మార్కుల దూరంలోనే నిలిచిపోయారని ఆందోళన చెందుతున్నారు. ఫలితాలపై అనేక అనుమాలు వ్యక్తమవుతున్నాయని, కాబట్టి అభ్యర్థుల ఓఎంఆర్‌‌‌‌‌‌‌‌ షీట్లను అందుబాటులో పెట్టాలని డీఎడ్, బీఎడ్ ​అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

అభ్యర్థుల లెక్కల్లో గందరగోళం

టెట్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల సంఖ్యపై గందరగోళం నెలకొన్నది. పేపర్ 1 లో అభ్యర్థుల సంఖ్య తగ్గగా, పేపర్​2లో మాత్రం పెరిగారు. ఈ నెల15న పేపర్1 ఎగ్జామ్​కు 2,26,744 మంది అటెండ్ అయ్యారని ప్రకటించిన అధికారులు.. ఫలితాల సమయంలో మాత్రం 2,23,582 మంది పరీక్ష రాశారని వెల్లడించారు. దీంతో 3,162 మంది అభ్యర్థుల సంఖ్య తగ్గడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క పేపర్ 2లో 1,89,963 ఎగ్జామ్ పరీక్ష రాశారని పేర్కొనగా, తాజాగా 1,90,047మంది రాసినట్టు తెలిపారు. పేపర్2 ఎగ్జామ్ లో  84 మంది అభ్యర్థులు పెరిగారు. అయితే, ఎగ్జామ్ రోజున డీఈఓలు కొందరు తప్పుడు వివరాలు ఇచ్చారని, ప్రస్తుతం ఇచ్చిన వివరాలే కరెక్ట్ అని ఎస్ సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి తెలిపారు. ఎగ్జామ్ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ‘వెలుగు’తో చెప్పారు.

పేపర్ 1లో మూడు మార్కులు యాడింగ్..

టెట్ ఫైనల్ కీని బుధవారం రిలీజ్ చేశారు. పేపర్1లో మూడు మార్కులు యాడ్ చేయగా, ఒక ప్రశ్నకు రెండు ఆప్షన్లు సరైనవేనని చెప్పారు. పేపర్ 2  సోషల్ స్టడీస్ లో రెండు మార్కులు యాడ్ చేయగా, ఒక క్వశ్చన్ కి మూడు ఆప్షన్స్, ఇంకో ప్రశ్నకు రెండు ఆప్షన్స్ కరెక్ట్ అని తెలిపారు. పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్లో  ఒక మార్కు కలుపగా, ఒక ప్రశ్నకు రెండు ఆప్షన్లు సరైనవిగా పేర్కొన్నారు.