- మంచిర్యాల జిల్లా గుడిపేట వద్ద ఘటన
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల నుంచి కోరుట్లకు వెళ్తున్న ఓ ఎక్స్ప్రెస్బస్సుకు త్రుటిలో అగ్ని ప్రమాదం తప్పింది. బస్సువెనుక చక్రాలకు బ్రేక్ లైనర్లు పట్టేసుకొని పొగలు రావడంతో ప్రయాణికులు హైరానా పడ్డారు. కొంతమంది ఆందోళనతో కిటికీల అద్దాల నుంచి కిందికి దూకారు.
ఈ ఘటన ఎన్‌హెచ్ 63పై మంచిర్యాల జిల్లా గుడిపేట వద్ద జరిగింది. కోరుట్ల డిపోకు చెందిన ఎక్స్ప్రెస్బస్సు సాయంత్రం 6 గంటల తర్వాత మంచిర్యాల నుంచి కోరుట్లకు బయల్దేరింది. ఆ సమయంలో బస్సులో దాదాపు 70 మంది ప్యాసింజర్లు ఉన్నారు. బస్సు గుడిపేట పోలీస్ బెటాలియన్ దాటగానే వెనుక చక్రాల నుంచి పొగలు రావడాన్ని ప్రయాణికులు గమనించారు.
వెంటనే డ్రైవర్‌కు చెప్పడంతో బస్సును ఆపివేశాడు. ఏం జరుగుతుందో అర్థంకాక పలువురు ఆందోళనకు గురయ్యారు. కొంత మంది కిటికీల అద్దాల నుంచి కిందికి దూకారు. అనంతరం మరో బస్సుల్లో ప్రయాణికులను పంపించారు. ఈ విషయమై హాజీపూర్ఎస్సై స్వరూప్‌రాజ్‌ను సంప్రదించగా, బ్రేక్‌లైనర్లు పట్టుకోవడంతో పొగలు వచ్చాయన్నారు. మంటలు రాలేదని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాలేదని చెప్పారు.
