పోస్టాఫీసుల్లో పాస్ పోర్టుకు దరఖాస్తు చేయొచ్చు

పోస్టాఫీసుల్లో పాస్ పోర్టుకు దరఖాస్తు చేయొచ్చు

న్యూఢిల్లీ: ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్లాలన్నా పాస్ పోర్ట్ తప్పనిసరి. అంతెందుకు పాస్ పోర్ట్ లేకపోతే దేశం దాటి ఎక్కడకు వెళ్లలేం.. ఒక్క నేపాల్ దేశం మినహా. ఎవరైనా దేశం దాటి వెళ్లాలంటే పాస్ పోర్ట్ తప్పనిసరి. విదేశాలకు వెళ్లాలన్న కల ఒక ఎత్తైతే.. దాన్ని నెరవేర్చుకునేందుకు అవసరమైన పాస్ పోర్టు సంపాదించడం పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోలేని వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారం.  ఇది ఒకప్పటి మాట. ఇకపై ఇంటికి సమీపంలోని పోస్టాఫీసుల్లోనే పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని భారత తపాళా శాఖ ప్రారంభిస్తోంది. ఇప్పటికే జిల్లా కేంద్రాలతోపాటు ప్రధాన పోస్టాఫీసుల్లో (హెడ్ పోస్టాఫీసులు) పాస్ పోర్టు దరఖాస్తు చేసుకునే సదుపాయం అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మరో కీలక ముందడుగు వేసింది తపాళాశాఖ. దేశమంతా త్వరలో డిజిటల్ మయం కాబోతున్న తరుణంలో చాలా వరకు చిన్న చిన్న పోస్టాఫీసులను సైతం ఆన్ లైన్ సదుపాయం కల్పించి కంప్యూటర్లు, నెట్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంటికి దగ్గర్లోని  పోస్టాఫీసుల్లో పాస్ పోర్టు దరఖాస్తు సదుపాయం భారత తపాళాశాఖ అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇదే విషయాన్ని ఇండియన్ పోస్ట్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. 
దరఖాస్తు చేసుకునే విధానం..
పాస్ పోర్టు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా తపాల శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. Passportindia.gov.in అనే వెబ్ సైట్ లో ఎక్కడెక్కడ.. ఏఏ బ్రాంచీల్లో పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకునే సదుపాయం అందుబాటులో ఉందో చెక్ చేసుకోవచ్చు.
పాస్ పోర్టు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే దానికి ముందు ఈ కేంద్రాల్లో టోకెన్లు తీసుకోవాలి.
మొదటగా పాస్ పోర్ట్ వెబ్ సైట్ కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఆన్ లైన్ లోనే పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ ధృవపత్రాల పరిశీలనకు ఒక తేదీని కేటాయిస్తారు. ఆ తేదీ నాడు పోస్టాఫీసుకు వెళ్లి.. మీరు రిజిస్టర్ చేసుకున్న రశీదుతోపాటు.. ఒరిజినల్ ధృవపత్రాలు చూపాల్సి ఉంటుంది. 
సంబంధిత అధికారులు మీ ఒరిజినల్ ధృవపత్రాలు పరిశీలించి ధృవీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆ వివరాలను దరఖాస్తు దారుని ఫోన్ నెంబర్ కే ఎస్.ఎం.ఎస్ మెస్సేజీ వస్తుంది. ఈ పాస్ పోర్టు ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి కనీసం 15 రోజులు పడుతుందని తపాలా శాఖ వెల్లడించింది.