- పటాన్ చెరులో సంతోష్ సాండ్, గ్రానైట్ అక్రమ మైనింగ్
- గూడెం మధుసూదన్‌రెడ్డి, విక్రమ్ రెడ్డికి చెందిన రూ.78.93 కోట్లు విలువైన ఆస్తులు జప్తు
- ప్రభుత్వానికి రాయల్టీ నష్టం రూ.39.08 కోట్లు వాటిల్లినట్లు గుర్తింపు
- గ్రానైట్ కొనుగోలు చేసిన సంస్థలకు చెందిన రూ.1.12 కోట్లు ఫ్రీజ్
- మొత్తం రూ.80.05 కోట్లు విలువైన ఆస్తులను తాత్కాలిక జప్తు చేసిన ఈడీ
హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో జరిగిన అక్రమ మైనింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. అక్రమ మైనింగ్‌తో ప్రభుత్వాన్ని మోసం చేసిన సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ సప్లై యజమాని గూడెం మధుసూదన్ రెడ్డి, జీవీఆర్ ఎంటర్‌ప్రైజెస్ యజమాని విక్రమ్ రెడ్డికి చెందిన రూ.78.93 కోట్ల విలువైన 81 ఆస్తులను జప్తు చేయడంతో పాటు గ్రానైట్ కొనుగోలు చేసిన సంస్థలు చెల్లించాల్సిన రూ. 1.12 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను ఆయా బ్యాంకుల్లో అటాచ్ చేసింది. మొత్తంగా రూ.80.05 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ జోనల్ ఈడీ కార్యాలయం సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది.
అక్రమ మైనింగ్‌తో రూ.300 కోట్లకు పైగా లూటీ
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోదరుడు, గూడెం మధుసూదన్ రెడ్డి యజమానిగా ఉన్న సంతోష్ సాండ్, గ్రానైట్ సప్లై కంపెనీ పటాన్చెరు మండలం లక్డారం గ్రామంలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ కు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి ఎంక్వైరీ చేశారు. లీజుముగిసినప్పటికీ గ్రానైట్ తవ్వకాలు చేపట్టడంతో పాటు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మైనింగ్చేసినట్లు తేల్చి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన ఈడీ అధికారులు.. ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ ద్వారా సర్కారుకు రూ.39 కోట్ల మేర రాయల్టీ ఎగవేయడంతో పాటు అక్రమ మైనింగ్ ద్వారా రూ.300 కోట్లు ఆర్జించినట్లు తేల్చారు. సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ సప్లైస్పేరుతో మైనింగ్ లైసెన్స్ ఉన్నప్పటికీ.. గూడెం మధుసూదన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి భాగస్వాములుగా ఉన్న జీవీఆర్ ఎంటర్‌ప్రైజెస్‌కు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.
ఇలా అక్రమంగా తరలించిన గ్రానైట్ అమ్మకాలపైనా ఈడీ దర్యాప్తు చేసింది. దర్యాప్తులో భాగంగా సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ సప్లై, జీవీఆర్ ఎంటర్ ప్రైజెస్‌తో పాటు గూడెం మధుసూధన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి సహా ఇతర భాగస్వాముల ఇండ్లలో గతంలో ఈడీ సోదాలు నిర్వహించింది. అప్పట్లో బినామీల పేరిట ఉన్న 81 ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను సీజ్ చేసింది. కోర్టు అనుమతితో తాజాగా రూ.1.12 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు సహా రూ.78.93 కోట్లు విలువ చేసే స్థిర చరాస్తులను జప్తు చేసింది.
