ఘోర విషాదం! అన్నకు రాఖీ కట్టి వస్తుండగా..

ఘోర విషాదం! అన్నకు రాఖీ కట్టి వస్తుండగా..

మొయినాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

బైక్​ను ఢీకొట్టిన జేసీబీ

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

హైదరాబాద్, వెలుగు : రాఖీ పండుగకు వెళ్లి తిరిగివస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నక్కలపల్లి గేట్ సమీపంలో  గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల మేరకు… మహేశ్వరం మండలం సుభాన్ పూర్​లో పోచారం బాల్ రెడ్డి కుటుంబం నివసిస్తోంది.  అతడు భార్య జ్యోతి, కూతురు సిరి, కుమారుడు సాయి చరణ్ రెడ్డితో కలిసి చేవెళ్లలో ఉంటున్న బావమరిది  శ్రీనివాస్ రెడ్డి (జ్యోతి అన్న) ఇంటికి రాఖీ పండగకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో నక్కలపల్లి వద్ద బైక్​ను జేసీబీ ఢీ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. కుమారుడు తీవ్ర గాయాలతో బయటపడగా సమీపంలోని భాస్కర్​ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.  మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

లంగర్ హౌస్ ఘటనలో కానిస్టేబుల్  కుమారుడు మృతి

హైదరాబాద్: పంద్రాగస్టు ఓ కానిస్టేబుల్ ఇంట్లో విషాదం నింపింది. ఇండిపెండెన్స్ డే వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్న కానిస్టేబుల్ పద్నాగేళ్ల కుమారుడిని వెహికల్ ఢీకొట్టడంతో అక్కడిక్కడే చనిపోయాడు. ఈ ఘటన లంగర్ హౌస్ లో పీఎస్ పరిధిలో జరిగింది.  వివరాల్లోకి వెళ్తే..ఖదీర్ ఖాన్ సైఫాబాద్ ట్రాఫిక్ పీఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. లంగర్ హౌస్ లో ఉంటున్న ఖదీర్ కుమారుడు అయాన్ (14) నలంద స్కూల్ లో 9వ తరగతి చదువుతున్నాడు. గురువారం అయాన్ స్కూల్ లో ఇండిపెండెన్స్ డే వేడుకలకు హాజరయ్యాడు.  స్కూల్ లో ప్రోగ్రామ్స్ పూర్తి కావడంతో తనను తీసుకెళ్ళాలని అయాన్ తండ్రి ఖదీర్ కి ఫోన్ చేశాడు. కుమారుడిని ఆటోలో ఇంటికి రావాల్సిందిగా ఖదీర్ చెప్పాడు. కానీ అయాన్ తన ఫ్రెండ్ తో కలిసి స్కూల్ నుంచి నడుచుకుంటూ  ఇంటికి బయలుదేరాడు. ఫుట్ పాత్ పై వెళ్త్తున్న సమయంలో అయాన్ ను వెనుక నుంచి వచ్చిన బొలేరో ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అయాన్ అక్కడికక్కడే  చనిపోయాడు.లంగర్ హౌస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయాన్ డెడ్ బాడీనీ పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.