దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఎన్ఐఏ దాడులు

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఎన్ఐఏ దాడులు

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో అరెస్టైన 18 మందిని పటియాలా హౌస్ కోర్ట్ 4రోజుల ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. ఈ కేసుకు సంబంధించి 11 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఎన్ఐఏ, ఈడీ, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో 106 మందికిపైగా పీఎఫ్ఐ సభ్యులను అరెస్ట్ చేశారు. ఈ సెర్చ్ ఆపరేషన్ లో దాదాపు 300 మంది అధికారులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

పీఎఫ్ఐ కేసుకు సంబంధించి ఎన్ఐఏ ఇవాళ 15 రాష్ట్రాల్లో 93 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించింది. కేరళలో 39, తమిళనాడులో 16, కర్నాటకలో 12, ఏపీలో 7, యూపీలో 2, రాజస్థాన్, మహారాష్ట్రల్లో 4, ఢిల్లీలో 2, తెలంగాణలో అసోం, మధ్య ప్రదేశ్, గోవా, బెంగాల్, బీహార్ మణిపూర్ రాష్ట్రాల్లో ఒక్కో చోట సోదాలు చేసినట్లు తెలుస్తోంది. 

106 మందిలో ఐదు కేసుల్లో నిందితులుగా ఉన్న 45 మందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వారిలో నలుగురు ఆంధ్రా, ఒకరు తెలంగాణ, 19 మంది కేరళ, ఏడుగురు కర్నాటక, 11 మంది తమిళనాడు, యూపీలో ఒకరు, రాజస్థాన్ కు చెందిన ఇద్దరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. మిగతా 61 మందిని ఈడీ, స్టేట్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. వీరంతా టెర్రరిజానికి నిధులు సమకూర్చడం, ఉగ్ర శిక్షణ, యువతను టెర్రరిజం వైపు ప్రోత్సహించడం తదితర కార్యకలాపాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. 

ఇదిలా ఉంటే ఎన్ఐఏ దాడుల నేపథ్యంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా శుక్రవారం కేరళలో ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని తమ పార్టీ నేతలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయంతీసుకున్నట్లు చెప్పింది.