సిద్దిపేట ప్రభుత్వ ఆసు పత్రిలో బ్లీడింగ్ ఆపేందుకు పెట్టిన క్లాత్ తీయకపోవడంతో ఆనారోగ్యం పాలైన పేషెంట్

సిద్దిపేట ప్రభుత్వ ఆసు పత్రిలో బ్లీడింగ్ ఆపేందుకు పెట్టిన క్లాత్ తీయకపోవడంతో ఆనారోగ్యం పాలైన పేషెంట్
  • ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన

సిద్దిపేట, వెలుగు: సీజేరియన్ ఆపరేషన్ అనంతరం రక్తస్రావం నియంత్రించేందుకు పెట్టిన మాబ్‌‌‌‌ (క్లాత్ ప్యాడ్) విషయంలో సరైన సూచనలు ఇవ్వకపోవడంతో ఓ మహిళ తీవ్ర అనారోగ్యానికి గురైన ఘటన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగులోకి వచ్చింది. పేషెంట్ తల్లి రాగి స్వరూప తెలిపిన వివరాల ప్రకారం.. రామాయంపేట మండలం సుతారిపల్లి గ్రామానికి చెందిన తన కుమార్తె నందినిని కాన్పు కోసం గత నెల సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. మొదట నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో ఏప్రిల్ 14న డాక్టర్ సీజేరియన్ చేశారు.  ఆపరేషన్ సమయంలో పేషెంట్ అంతర్గత భాగాల నుంచి రక్తస్రావం జరుగుతుండడంతో దాన్ని నియంత్రించేందుకు డాక్టర్ క్లాత్ ప్యాడ్‌‌‌‌ను  ఉంచారు. 

అయితే ఆ ప్యాడ్‌‌‌‌ను తరువాత తొలగించాల్సిన విషయంపై పేషెంట్‌‌‌‌కు సరైన సూచనలు ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో ఆ ప్యాడ్ తొలగించాల్సిన విషయం పేషెంట్ మరిచిపోవడంతో, ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు రామాయంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి స్కానింగ్ చేయించగా, ఆపరేషన్ సమయంలో రక్తస్రావం ఆపేందుకు వాడిన ప్యాడ్ అలాగే ఉండిపోయినట్లు వైద్యులు గుర్తించారు. ఈ విషయంపై శనివారం పేషెంట్‌‌‌‌తో పాటు బంధువులు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి డాక్టర్లను ప్రశ్నించగా, సరైన సమాధానం ఇవ్వలేదని వారు ఆరోపించారు. 

అనంతరం మెరుగైన చికిత్స కోసం పేషెంట్‌‌‌‌ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తల్లి స్వరూప తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన నందినికి ఆపరేషన్ చేసిన డాక్టర్ సింధూరి మాట్లాడుతూ.. మొదట నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించామని, అయితే శిశువుకు మెడికల్ సమస్యలు తలెత్తే అవకాశముండడంతో సీజేరియన్ చేయాల్సి వచ్చిందన్నారు. ఆపరేషన్ తర్వాత బ్లీడింగ్‌‌‌‌ను నియంత్రించేందుకు మాబ్ పెట్టామని, అయితే పేషెంట్ సమయానికి రివ్యూకు రాకపోవడం, ఫాలోఅప్ చేయకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తిందని, ఇందులో తమ నిర్లక్ష్యం లేదని చెప్పారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై వివరణ కోరగా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి ఇన్‌‌‌‌ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ మాట్లాడుతూ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.