డెడ్ బాడీ అడిగితే రూ.3లక్షలు కట్టమన్నారు

డెడ్ బాడీ అడిగితే రూ.3లక్షలు కట్టమన్నారు

అబిడ్స్,వెలుగు: జులై 24న రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఆదివారం చనిపోయాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని అతడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. డెడ్ బాడీ తీసుకెళ్లేందుకు పెండింగ్ ఫీజు డబ్బులు కట్టాలని డాక్టర్లు చెప్పారని మృతుడి కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. గత నెల 24న  రోడ్డు ప్రమాదంలో గాయపడిన పటాన్ చెరుకి చెందిన మంగలి సంతోశ్(23)ను మొదట కొండాపూర్ లోని కిమ్స్ కి తరలించారు. అక్కడి డాక్టర్ల సూచన మేరకు మెరుగైన ట్రీట్ మెంట్ కోసం సికింద్రాబాద్ లోని కిమ్స్ కి తీసుకెళ్లారు. శనివారం సంతోశ్ కోలుకుంటున్నాడని చెప్పిన డాక్టర్లు ఆదివారం ఉదయం అతడు చనిపోయినట్లు నిర్ధారించారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పటికే ట్రీట్ మెంట్ కోసం రూ.8లక్షలు కట్టించుకున్నారని వారు తెలిపారు. పెండింగ్ బిల్లు రూ.3లక్షలు కట్టేవరకు డెడ్ బాడీ అప్పగించమన్నారని సంతోశ్​ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. సెలూన్ లో పని చేసే తాను అంత డబ్బు చెల్లించలేనని చెప్పినా వారు ఒప్పుకోలేదని.. చివరికి రూ.లక్ష కట్టించుకుని తమ కుమారుడి డెడ్ బాడీని అప్పగించారని మృతుడి తండ్రి చెప్పాడు.

3 నెలల క్రితమే పెళ్లైన సంతోశ్​ కి పెళ్లైందని.. హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న తమ కుమారుడు  డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయాడని  తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.