అడ్మిట్​ టైమ్​లో నెగెటివ్..సర్జరీకి ముందు పాజిటివ్

అడ్మిట్​ టైమ్​లో నెగెటివ్..సర్జరీకి ముందు పాజిటివ్
  • ఐసోలేషన్​ సెంటర్​లేక బయటకు పంపిస్తున్న డాక్టర్లు  
  • రోజుకు 10 మందికి పైగా పేషెంట్ల డిశ్చార్జి 
  • సెకండ్ వేవ్ వరకు ఉన్న వార్డుని తొలగించిన అధికారులు
  • గాంధీ లేకపోతే హోం క్వారంటైన్​లో ఉండాలని సూచన
  • ఎటు పోవాలో తెలియక సొంతూళ్లకు వెళుతున్న పేషెంట్లు 

“ సంగారెడ్డి జిల్లాకు చెందిన ధనుంజయ(66) నరాల నొప్పితో బాధపడుతూ గత నెల 24న ఎర్రగడ్డలోనిఈఎస్ఐ హాస్పిటల్ లో చేరాడు. కరోనా టెస్టు చేస్తే నెగెటివ్​రాగా, వెంటనే అడ్మిట్​చేసుకుని పలు రకాల టెస్టులు చేసి సర్జరీ కోసం నిమ్స్ కి రెఫర్​చేశారు. దీంతో ఈనెల 9న నిమ్స్ లో అడ్మిట్​అవగా,14న సర్జరీ చేస్తామని చెప్పారు. ఈరోజు ముందుగా కరోనా టెస్ట్​ చేస్తే ధనుంజయకు పాజిటివ్​అని రావడంతో డాక్టర్లు సర్జరీ పోస్ట్​పోన్ చేశారు. గాంధీకి లేదంటే  ఇంట్లో హోం క్వారంటైన్ లో ఉండాలని పంపించారు. పేషెంట్​నడవలేని స్థితిలో ఉన్నా ఇంటికి తీసుకెళ్లారు. అతనికి ట్రీట్​మెంట్​కి వచ్చే ముందు లేని కరోనా హాస్పిటల్​లో చేరిన తర్వాతనే సోకింది.’’ 

“జియాగూడకు చెందిన హేమలత కాళ్లకు సంబంధించిన సర్జరీ కోసం నిమ్స్​లో వారం కిందట అడ్మిట్​అయింది.  సర్జరీకి ఒకరోజు ముందు కరోనా టెస్టు చేయగా పాజిటివ్​ వచ్చింది. దీంతో నెగెటివ్​వచ్చాక రావాలని డాక్టర్లు ఆమెని డిశ్చార్జ్​చేశారు. నడవలేని స్థితిలో ఉన్న ఆమెని నిమ్స్ నుంచి గాంధీ తీసుకెళ్లారు. హాస్పిటల్​కి వచ్చే సమయంతో బాగానే ఉన్నా ఇక్కడకు వచ్చాకనే కరోనా సోకినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ’’ 

హైదరాబాద్​, వెలుగు: నిమ్స్ లో సర్జరీల​కోసం అడ్మిట్​అయ్యే పేషెంట్లు కొవిడ్​బారిన పడుతున్నారు. థర్డ్​వేవ్​లో ప్రస్తుతం  ఆస్పత్రిలో ఐసోలేషన్​సెంటర్​లేక సర్జరీ పేషెంట్లుకు ఇబ్బందులు తప్పడంలేదు.  కొవిడ్​సెంటర్​ఏర్పాటుపై మేనేజ్​మెంట్ కూడా​పట్టించుకోవడంలేదు.  ఫస్ట్​, సెకండ్​ వేవ్​ టైమ్​లో 200 బెడ్స్​తో ఐసోలేషన్​సెంటర్​ఏర్పాటు చేసి ట్రీట్ మెంట్​అందించారు. ప్రస్తుతం ఎలాంటి ఫెసిలిటీ కల్పించడంలేదు.  పలు రకాల ట్రీట్ మెంట్లు, సర్జరీలకు వచ్చి కరోనా బారిన పడితే డాక్టర్లు పట్టించుకోకుండా నెగెటివ్​వచ్చాక రావాలని డిశ్చార్జీ చేసి పంపిస్తున్నారు. దీంతో చేసేదేమి కుటుంబ సభ్యులు తమవారిని తీసుకెళ్లిపోతున్నారు. ఆర్థికంగా ఉన్నవారు ప్రైవేట్​ఆస్పత్రులకు పోతున్నారు.  కొందరు గాంధీలో జాయిన్​అయితున్నారు. చాలామంది హోం ఐసోలేషన్ లో ఉంటామని సొంతూళ్లకు వెళ్తున్నారు. ఇక్కడి నుంచి వేరే చోటకు రెఫర్ చేయకుండా గతంలో మాదిరిగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేస్తే జిల్లాల నుంచి వచ్చే పేద రోగులకు ఇబ్బందులు తప్పుతాయి. దీనిపై నిమ్స్​ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. నిమ్స్ వైద్య సిబ్బందికి కేవలం 30 బెడ్స్​ మాత్రమే ఉంచారు. అవి కూడా 15 రోజులుగా ఫుల్​గానే ఉంటుండగా ప్రస్తుతం స్టాఫ్ కరోనా వచ్చినా ఇతర హాస్పిటల్స్​కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. 
రోజూ పది మందికిపైగా డిశ్చార్జీ
పలు రకాల ట్రీట్​మెంట్లకు నిమ్స్​లో అడ్మిట్​అయ్యే పేషెంట్లలో రోజూ10 మందికిపైగా పాజిటివ్​వస్తుండగా సర్జరీ చేయకుండానే డిశ్చార్జీ చేస్తున్నారు. కాళ్లు, చేతులు, నరాలు, బ్రెయిన్​తో పాటు గుండె తదితర వ్యాధులకు సంబంధించిన పేషెంట్లని కూడా పంపిస్తున్నారు.  ఐసీయూలో నడవలేని పరిస్థితిలో ఉన్న పేషెంట్ కు కూడా ఐసోలేషన్ ఫెసిలిటీ కల్పించడంలేదు. గాంధీకి లేకపోతే ప్రైవేట్​హాస్పిటల్స్​కు లేదంటే ఇంటికి తీసుకెళ్లమని సూచిస్తున్నారు. నెలరోజులుగా  కరోనాతో 200 మందికిపైగా పేషెంట్లను సర్జరీలు చేయకుండానే డిశ్చార్జీ చేశారు. 

ఆస్పత్రిలో చేరినంక పాజిటివ్ 
ఆస్పత్రిలో పేషెంట్​అడ్మిట్​అయ్యే ముందు కరోనా టెస్ట్​చేస్తే నెగెటివ్​వస్తోంది. సర్జరీ చేయాల్సిన రోజున ముందుగా మళ్లీ కరోనా టెస్ట్​చేస్తే నెగెటివ్ వస్తుంది. దీంతో సర్జరీలు క్యాన్సిల్​చేసి నెగెటివ్​ వచ్చాకే రావాలంటూ పేషెంట్లను బయటకు పంపుతున్నారు. అడ్మిట్​అయ్యే వారిలో10 శాతం మంది పేషెంట్లకు ఆస్పత్రిలోనే కరోనా సోకుతోంది. సర్జరీ చేయించు కోకుండానే ఇంటికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని పేషెంట్ల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

డైరెక్టర్, సూపరింటెండెంట్​ నో రెస్పాండ్​
నిమ్స్ లో ఐసోలేషన్ వార్డు ఏర్పాటుపై ఆస్పత్రి డైరెక్టర్, సూపరింటెండెంట్​లను కలిసేందుకు గురువారం వెళ్లగా ఇద్దరూ లీవ్​లో ఉన్నట్లు వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. ఫోన్​లో సంప్రదించినా రెస్పాండ్​కాలేదు. డ్యూటీ ఆర్ఎంఓని కాంటాక్ట్​అవగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయలేదని చెప్పారు. పేషెంట్లను గాంధీకి తీసుకుపోవాలని, లేదంటే హోం ఐసోలేషన్ లో ఉండాలని సూచిస్తున్నామని తెలిపారు. 

ఐసోలేషన్ వార్డు పెట్టాలె
నాన్నని సర్జరీ కోసం నిమ్స్​లో చేర్చాం. ఈనెల14న అపాయింట్​మెంట్​ఇచ్చారు.  ఈరోజు ఉదయం 7 గంటలకు కరోనా పాజిటివ్​వచ్చిందని సర్జరీ పోస్ట్ పోన్ చేస్తున్నామని డాక్టర్​చెప్పారు. ఇక్కడ ఐసోలేషన్ వార్డు లేదని, గాంధీకి వెళ్లాలని లేదంటే హోం ఐసోలేషన్ లో ఉండాలని సూచించి పంపారు. నాన్న నడవలేని స్థితిలో ఉండగా, తప్పదనుకుని ఇంటికి తీసుకెళ్తున్నాం.   - రమేశ్, పేషెంట్ కుమారుడు