
బెంగళూరు నుంచి పాట్నా వెళ్తున్న గోఎయిర్ ఫ్లైట్ ఈ రోజు ఉదయం నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. 139 మంది ప్రయాణిస్తున్న గోఎయిర్ జీ8873 విమానంలోని ఒక ఇంజన్‌లో టెక్నికల్ సమస్య తలెత్తింది. దీంతో పైలట్ వెంటనే అప్రమత్తమై ఆ ఇంజన్‌ను ఆఫ్ చేశారు. ఒకే ఇంజన్‌తో నడుస్తున్న విమానానికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఆ సమయంలో దగ్గరగా ఉన్న నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఉదయం 11.15 సమయంలో ఫ్లైట్ సేఫ్‌గా నాగ్‌పూర్‌లో ల్యాండ్ అయిందని, ఆ తర్వాత ప్రయాణికులందరినీ కిందికి దించి, వాళ్లకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేశామని గోఎయిర్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రయాణికులకు నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టులోనే భోజనం కూడా అందించామని చెప్పారు. ప్రత్యామ్నాయంగా మరో విమానం ఏర్పాటు చేశామని, ఆ విమానం సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి పాట్నాకు వెళ్తుందని అన్నారు.