కొమురవెల్లి మల్లన్న పట్నం టికెట్ల రేట్లు పెంపు!

కొమురవెల్లి మల్లన్న  పట్నం టికెట్ల రేట్లు పెంపు!
  • పెరగనున్న పట్నం టికెట్ల రేట్లు
  • ఆమోదం తెలిపిన ఆలయ పాలకవర్గం

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో పట్నం టికెట్ల రేట్లు పెంచడానికి రంగం సిద్ధమైంది. ఏటా దాదాపు 10 లక్షలకు పైగా భక్తులు కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుంటే వీరిలో 60 శాతానికి పైగా వివిధ రకాలైన పట్నాలతో  మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. రెండు రోజుల క్రితం ఆలయ పాలక మండలి సమావేశంలో పట్నం టికెట్ల రేట్ల పెంపునకు ఆమోదముద్ర వేశారు. దీంతో గతంలో తయారుచేసిన ప్రతిపాదనల్ని మరోసారి  ఉన్నతాధికారులకు సమర్పించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వారం రోజుల్లో మూడు నెలల మహాజాతర ప్రారంభం అవుతుండటంతో ఇదే సమయంలో పెంచిన కొత్త రేట్లు అమలులోకి వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

పట్నాల ఆదాయమే అధికం

గత ఏడాది పట్నం టికెట్ల రేట్లు పెంచాలని అధికారులు ప్రయత్నించగా ప్రతిపక్ష పార్టీల నిరసనతో వెనక్కి తగ్గారు. ప్రస్తుతం ఆలయ పాలక మండలి పట్నం టికెట్ల ధరల్ని పెంచడానికి ఆమోదం తెలపడంతో గత ఏడాది నిర్ణయించిన రేట్లనే అమలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కొమురవెల్లిలో  భక్తులు మూడు రకాల పట్నాలతో మల్లన్నకు మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులు బస చేసే ప్రాంతంలో వేసేది  చిలక పట్నం, ఆలయంలోని గంగరేణి చెట్టు వద్ద వేసేది నజర్ పట్నం, ఆలయం లోపల వేసేది  ముఖ మండప పట్నం. చిలక పట్నం టికెట్ రేట్ రూ. 80 నుంచి 150, నజర్ పట్నం రూ. 100 నుంచి 200, ముఖ మండప పట్నం రూ. 200 నుంచి 300 చేసేందుకు ప్రతిపాదించారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ సంవత్సరాదాయంలో అత్యధిక భాగం పట్నం టికెట్ల అమ్మకం ద్వారానే లభిస్తోంది. కొమువెల్లి మల్లన్న సంవత్సరాదాయం  రూ. 18 నుంచి 20  కోట్లు ఉంటే అందులో  దాదాపు రూ. ఐదు  కోట్ల  పైచిలుకు  పట్నం టికెట్ల అమ్మకం ద్వారానే సమకూరుతుంది. ఆలయానికి చెందిన 150 మంది ఒగ్గు పూజారులు వివిధ రకాలైన పట్నాలు వేసి భక్తులు మొక్కులు చెల్లించుకునేలా చూస్తారు. పట్నాల ద్వారా వచ్చిన ఆదాయంలో సగం ఒగ్గు పూజారులకు, మిగిలిన సగం ఆలయానికి చెందుతుంది.