న్యాల్కల్ లో పశువుల సంతకు పోటెత్తిన జనం ..రూ.3.30 లక్షలు పలికిన కాడెద్దులు

న్యాల్కల్ లో పశువుల సంతకు పోటెత్తిన జనం ..రూ.3.30 లక్షలు పలికిన కాడెద్దులు

న్యాల్కల్‌, వెలుగు : న్యాల్కల్ గ్రామ శివారులోని హజ్రత్ పీర్ గయాబ్ సాహెబ్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన పశువుల జాతర (సంత)కు అపూర్వ స్పందన లభించింది. గత నెల 30న నుంచి కొనసాగుతున్న ఉర్సు ఉత్సవాల్లో భాగంగా జరిగిన సంతకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది పశువులు తరలిరావడంతో దర్గా పరిసర ప్రాంతం కిక్కిరిసిపోయింది. రంగురంగుల అలంకరణలతో పశువులను ప్రదర్శించడంతో సందర్శకులకు కనువిందుగా మారింది. 

పశువుల కొనుగోలుకు వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు భారీగా తరలివచ్చి పోటీగా ధరలు పలికారు. జాతరలో కాడెద్దుల గరిష్టంగా రూ.3.30 లక్షల వరకు ధర పలకడం విశేషం. రాయికోడ్ మండలం జంగి గ్రామానికి చెందిన సల్మాన్ రైతు వద్ద కాడెద్దుకు రూ.2.40 లక్షలు ధర పలికింది. మునిపల్లి మండలం పెద్ద గోపులారం గ్రామానికి చెందిన సామెల్ రైతు కాడెద్దుకు రూ.5.50 లక్షలు అడగగా, చివరకు రూ.3.30 లక్షలకు ఒప్పందం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు.

 మనూర్ మండలం శేలిగిర గ్రామానికి చెందిన గోపాల్‌, టేక్మల్ మండలం బొడ్‌పల్లి గ్రామానికి చెందిన నాగభూషణం, తుమ్మలపల్లి గ్రామానికి చెందిన నాగేశ్ తదితరులు పశువులను కొనుగోలు చేశారు. ఉర్సు ఉత్సవాల్లో భాగంగా ఉత్తమ పశుపోషక రైతులకు స్థానికంగా దివంగత హోతి అడివప్ప, గిరిజమ్మ, హోతి సురేశ్ జ్ఞాపకార్థంగా కుటుంబ సభ్యుడు హోతి బస్వరాజ్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. డీఎస్పీ సైదా, సీఐ శివలింగం, ఎస్ఐ సుజిత్ పాల్గొని రైతులను సత్కరించారు. వివిధ ప్రాంతాల రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.