నేను ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకెందుకు: పవన్ కళ్యాణ్

నేను ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకెందుకు: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్దే తన మొదటి ప్రాధాన్యతని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.  జనసేన , టీడీపీతో పొత్తు పెట్టుకున్న తరువాత ఈ కూటమిపై ప్రజలకు భరోసా పెరిగిందన్నారు.తాను ఎవరితో పొత్తుపెట్టుకుంటే వైసీపీకి ఎందుకని ప్రశ్నించారు.జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో అది వైసీపీకి అనవసరమన్నారు. బీజేపీ పొత్తు విషయంలో స్పందించిన పవన్ కళ్యాణ్.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చామన్నారు. ప్రధాని మోడీ జీ 20 సమావేశంలో బిజీగా ఉన్న సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. టీడీపీతో పొత్తు ప్రకటన చేసేటప్పుడు బీజేపీ నేతలు జీ 20 సమావేశాల్లో బిజీగా ఉన్నారన్నారు.  ఢిల్లీ బీజేపీ నేతలతో సంప్రదించిన తరువాతే టీడీపీతో పొత్తు ప్రకటించానన్నారు. బీజేపీ, జనసేన కమిటి యాక్షన్ లో నే ఉందన్నారు. పొత్తులపై తాము స్వయంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు.  2014 ఎన్నికల మాదిరిగానే 2024 ఎన్నికల్లో కూడా కలిసివెళ్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. 

టీడీపీతో సమన్వయం కోసం ఐదుగురు జనసేన నేతలతో కమిటి ఏర్పాటు చేశామన్నారు.  ఈ కమిటికి చైర్మన్ గా నాదెండ్ల మనోహర్ ను నియమించారు. తెలంగాణకు ఇచ్చిన వరాలు... ఏపీకి ఎందుకు ఇవ్వలేదని ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లి అడగాలన్నారు.  తాను తన ప్రోగ్రామ్స్ కు వెళ్తుంటే  ఆపేశారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే తన లక్ష్యమని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులతో భయానక వాతావరణం సృష్టిస్తుందన్నారు.