అప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ - ఇప్పుడు బడ్జెట్ గ్యారెంటీ పాలిటిక్స్..!

అప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ - ఇప్పుడు బడ్జెట్ గ్యారెంటీ పాలిటిక్స్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకుంటాడో ఎవ్వరూ ఊహించలేరు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ సాధ్యం చేసి చూపించటమే తన లక్ష్యం అని పార్టీ ఆవిర్భావం నాటి నుండి చెబుతూ వస్తున్నాడు పవన్. 2019 ఎన్నికల్లో చాలావరకూ జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఫాలో అయినప్పటికీ ఆశించిన ఫలితం దక్కకపోగా ఒకవైపు జీరో బడ్జెట్ అంటూనే ఎన్నికల్లో మనీ పాలిటిక్స్ ప్రోత్సహించే టీడీపీ లాంటి పార్టీతో పొత్తు పెట్టుకున్నాడన్న అపవాదు మూటకట్టుకున్నాడు.

2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో కలిసి బరిలో నిలవాలని నిర్ణయానికి వచ్చిన జనసేనాని ఆ దిశగా అడుగులు వేసేందుకు కార్యకర్తలను సిద్ధం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల భీమవరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేయండని తానెప్పుడూ చెప్పలేదని, ఎన్నికల్లో డబ్బులతో ఓట్లు కొనండని చెప్పను కానీ, కనీసం మీటింగ్స్ వచ్చిన వారికి బోజనాలైనా పెట్టాలని సూచించానని తెలిపాడు. ఎన్నికల్లో ఖర్చు పెట్టనిదే ఫలితం దక్కదని, కొన్నాళ్ళు ఈ అబద్దపు లోకంలోనే బతుకుదామని అన్నాడు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కార్యకర్తలను, అభిమానులను సైతం ఒకింత ఆశ్చర్యానికి గురి చేశాయని చెప్పాలి. 2024 ఎన్నికల్లో ఎలా అయినా అదికారంలోకి రావాలనే కాంక్షే పవన్ వైఖరిలో మార్పుకు కారణం అని అర్థమవుతోంది. జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో కొత్త తరం రాజకీయానికి నాంది పలుకుతానన్న పవన్ వైఖరిలో వచ్చిన ఈ సడన్ చేంజ్ వచ్చే ఎన్నికల్లో అయినా సానుకూల ఫలితాన్ని ఇస్తుందా లేదా వేచి చూడాలి.