
రాజ్యసభకు ఎంపికైన ప్రముఖులు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్, వీరేంద్ర హెగ్గడే, పి.టి.ఉష లకు నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వారికి రాజ్యసభకు నామినేట్ చేసినందుకు ప్రధాని మోదీకి పవన్ అభినందనలు చెప్పారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
"పెద్దల సభ అయిన రాజ్యసభకు ఇళయ రాజా, విజయేంద్ర ప్రసాద్, వీరేంద్ర హెగ్గడే, పి.టి.ఉష సభ్యులుగా నియమితులయ్యారనే వార్త ఎంతో ఆనందాన్ని కలిగించింది. రాజ్యసభకు రాష్ట్రపతి ద్వారా నామినేట్ అయిన వీరికి నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. స్వర జ్ఞాని ఇళయరాజా, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, సామాజిక సేవకులు వీరేంద్ర హెగ్గడే, పరుగుల రాణి పి.టి.ఉష.. తమ రంగాల్లో మన దేశ పేరు ప్రతిష్టలను ఇనుమడింప చేసిన స్రష్టలు. వీరి సేవలు, అనుభవాన్ని సముచితరీతిన గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర నాయకత్వానికి అభినందనలు తెలియచేస్తున్నాను.
పదవులు ఇవ్వాలంటే రాజకీయంగా ఎంత లబ్ది కలుగుతుంది? ఎన్ని కోట్లు మన ఇంట్లోకి వచ్చి చేరుతాయి అని కొన్ని పార్టీల అధినాయకులు లెక్కలు వేసుకుని ముక్కు ముఖం తెలియని వారికి పెద్ద పదవులు కట్టబెట్టడం జగమెరిగిన సత్యం. ఇటువంటి ఈ కాలంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని మనసారా స్వాగతిస్తున్నాను" అని పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
శ్రీ ఇళయరాజా, శ్రీ విజయేంద్ర ప్రసాద్, శ్రీ వీరేంద్ర హెగ్గడే, శ్రీమతి పి.టి.ఉషకు శుభాకాంక్షలు - JanaSena Chief Shri @PawanKalyan #RajyaSabha pic.twitter.com/Qcwo9T0YNm
— JanaSena Party (@JanaSenaParty) July 7, 2022