ఇది నా మాతృభూమి.. ఎక్కడికైనా వెళ్తా : పవన్‌‌ కల్యాణ్

ఇది నా మాతృభూమి.. ఎక్కడికైనా వెళ్తా : పవన్‌‌ కల్యాణ్
  •     తెలంగాణలో కాంగ్రెస్ వచ్చాకే ప్రాంతీయ విద్వేషాలు: పవన్‌‌ కల్యాణ్
  •     బీఆర్‌‌‌‌ఎస్ పాలనలో ఈ తరహా పరిస్థితులు లేవు 
  •     గత 13 నెలలుగా నన్ను టార్గెట్ చేశారని మండిపాటు
  •     ఢిల్లీలో ఎన్డీయే కూటమి నేతల మీటింగ్‌‌కు హాజరు

న్యూఢిల్లీ - వెలుగు: దేశంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు తనకు ఉందని, హైదరాబాద్‌‌కు రావడానికి ఎవరి అనుమతి అవసరం లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. 12 ఏండ్ల మోదీ పాలన పురస్కరించుకొని బుధవారం ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి నేతల మీటింగ్‌‌లో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ నేషనల్‌‌ మీడియా సంస్థతో ఆయన మాట్లాడారు. ఇటీవల హైదరాబాద్‌‌లో తన పర్యటనపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వలేదని, రాష్ట్రంలోకి అడుగుపెట్టనివ్వమంటూ బెదిరింపులు వచ్చాయని ఆరోపించారు. 

‘‘ఇది ఎవరి జాగీరు కాదు.. ఇది నా మాతృభూమి. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ త‌‌ర‌‌హా పరిస్థితులు ఎదురు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే ప్రాంతీయ విద్వేష రాజకీయాలు పెరిగాయి. గత 13 నెలలుగా నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. తన ప్రాథమిక హక్కులను హరించేలా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. దేశ సమైక్యతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత. ముఖ్యమంత్రులే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం చాలా బాధగా ఉంది’’అని ఆయన పేర్కొన్నారు. 

తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ లేదు.. 

తెలంగాణలో జనసేనకు బలమైన క్యాడర్, నాయకత్వం ఉందని పవన్‌‌ కల్యాణ్ అన్నారు. అయినా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎంగా, జనసేన అధినేతగా ఏపీ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యం ధ్యేయ‌‌మ‌‌న్నారు. కుల రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే లోతైన అవగాహన అవసరమన్నారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఏ కులం కారణంగా ఆ స్థాయికి చేరుకున్నారని ప్రశ్నించారు. డిలిమినేషన్ అంశంపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన ఉందని, అయితే ఈ అంశంతో ఉత్తర- దక్షిణ విభజన దేశ ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొన్నారు. తన అన్న చిరంజీవి తనను నక్సలిజం ఆలోచనల నుంచి నిర్మాణాత్మక మార్గం వైపు నడిపారని పవన్‌‌ చెప్పారు. యువకుడిగా ఉన్న దశలో నక్సలైట్ కావాలనే ఆలోచన తనలో ఉండేదని, అయితే అన్న చిరంజీవి తనను నిర్మాణాత్మక మార్గంలో నడిపించారన్నారు.