
ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలతోనూ అభిమానులను అలరిస్తున్నారు పవన్ కళ్యాణ్(Pawan kalyan). ఆయన హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఓజీ(OG) ఒకటి. సుజిత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబందించి ఓ కొత్త అప్‌డేట్ వచ్చింది. ఇందులో పవన్ కళ్యాణ్ పాట పాడబోతున్నారట. ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్న తమన్, ఇటీవల ఓ టీవీ షోలో ఈ విషయాన్ని రివీల్ చేశారు. మూవీ స్క్రిప్ట్ ప్రకారం పవన్ కళ్యాణ్ చేత పాట పాడించే అవకాశాలు ఉన్నట్టుగా అతను చెప్పుకొచ్చాడు.
ఇప్పటికే తాను సంగీతం అందించిన చిత్రాల్లో స్టార్ హీరోల చేత పాటలు పాడించిన తమన్.. ‘అజ్ఞాతవాసి’ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ చేత ‘కొడకా కోటేశ్వర్ రావు’ అనే చిన్న పాట పాడించాడు. ఇదేకాక తమ్ముడు, ఖుషి, జానీ, పంజా, అత్తారింటికి దారేది లాంటి చిత్రాల్లో బిట్ సాంగ్స్ పాడిన పవన్.. ‘ఓజీ’ కోసం మరోసారి పాట పాడతారేమో చూడాలి. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తున్నాడు. ప్రకాష్ రాజ్, వెంకట్, హరీష్ ఉత్తమన్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.