
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'OG' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. హరిహర వీరమల్లు తర్వాత సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, సాధారణ వారం రోజుల్లో కూడా స్టడీగా వసూళ్లు సాధిస్తూ, ఈ ఏడాది అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల మైలురాయిని చేరుకోవడానికి పరుగులు తీస్తోంది.
ఆరు రోజుల్లో అసాధారణ వసూళ్లు!
'OG' చిత్రం ప్రీమియర్‌లతో సహా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. సోమవారం రోజు భారీ డ్రాప్ కనిపించినప్పటికీ, ఆ తర్వాత రోజుల్లో సినిమా కలెక్షన్లు స్థిరంగా కొనసాగాయి. ఆరు రోజుల ముగింపు నాటికి, ఈ యాక్షన్ థ్రిల్లర్ భారతదేశంలో రూ.154 కోట్ల నికర వసూళ్లను నమోదు చేసింది. మొత్తం రూ.183 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లోనూ ఇదే స్థాయిలో అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఆరు రోజుల్లోనే 'OG' ప్రపంచవ్యాప్త మొత్తం వసూళ్లు సుమారు రూ. 275 కోట్లకు చేరుకున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ చిత్రం 10 మిలియన్ల డాలర్లు వసూళ్లను దాటింది.
రికార్డుల వేటలో 'OG'
'OG' చిత్రం కేవలం వారం రోజుల్లోనే 2025 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది, వెంకటేష్ 'సంక్రాంతికి వస్తాను' చిత్రాన్ని అధిగమించింది. అంతేకాకుండా, ఇది ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' ( రూ.268 కోట్లు), మలయాళ స్టార్ మోహన్‌లాల్ 'L2: ఎంపురాన్' (రూ.267 కోట్లు) చిత్రాల వసూళ్లను కూడా దాటేసింది. ఒకటి రెండు రోజుల్లోనే 'హౌస్‌ఫుల్ 5' (రూ. 288 కోట్లు), మలయాళ హిట్ 'లోకా చాప్టర్ 1' (రూ.290 కోట్లు) రికార్డులను అధిగమించే దిశగా పయనిస్తోంది.
ఈ చిత్రం శుక్రవారం నాటికి సులభంగా రూ.300 కోట్ల మార్కును దాటుతుందని ట్రేడ్ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. మంగళవారం ఒక్క రోజునే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.10 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. రెండవ వారాంతంలో మంచి ప్రదర్శన ఇస్తే, 'OG' లైఫ్‌టైమ్ కలెక్షన్ రూ.350 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంది అభిప్రాయపడుతున్నారు.
దర్శకుడు సుజిత్ రూపొందించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీరా అనే మాజీ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించారు, అతను ముంబైకి తిరిగి వచ్చి క్రూరమైన శత్రువు ఓమిని ఎదుర్కొంటాడు. ఓమి పాత్రను బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి తన తొలి తెలుగు చిత్రంలో పోషించారు. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. మాస్ యాక్షన్, హై-క్లాస్ విజువల్స్, పవన్ కళ్యాణ్ శక్తివంతమైన స్క్రీన్ ప్రజెన్స్ కలగలిసిన 'OG' చిత్రం ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించింది. ఈ విజయం తెలుగు సినిమా యొక్క పాన్-ఇండియా ప్రజాదరణ మరింత పెరుగుతోందని మరోసారి నిరూపించింది. ఇంకా ఎలాంటి రికార్డులు సృష్టిస్తోందో చూడాలి మరి.