పీఎఫ్‌ అకౌంట్‌ ద్వారా ఎల్‌ఐసీ ప్రీమియం కట్టొచ్చు!

పీఎఫ్‌ అకౌంట్‌ ద్వారా ఎల్‌ఐసీ ప్రీమియం కట్టొచ్చు!
  •  కేవలం ఎల్‌ఐసీ పాలసీలకే వీలు..

న్యూఢిల్లీ: ఎల్‌‌ఐసీ ప్రీమియం  కట్టడానికి లాస్ట్ డేట్ దగ్గర పడుతోంది. కానీ, చేతిలో డబ్బులు లేవు. ఎలా అని ఆలోచించే ఉద్యోగులకు గుడ్‌‌ న్యూస్‌‌! ఇక ఎల్‌‌ఐసీ ప్రీమియాన్ని తమ పీఎఫ్‌‌ అకౌంట్‌‌ నుంచే ఉద్యోగులు  కట్టుకోవచ్చు. కానీ,ఈ ఫెసిలిటీని స్టార్ట్ చేయడానికి  ఫార్మ్‌‌ 14 ను ఈపీఎఫ్‌‌ఓ ఆఫీస్‌‌లలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.  అంతేకాకుండా, ఈ ఫార్మ్‌‌ను సబ్మిట్ చేసే టైమ్‌‌కు  పీఎఫ్‌‌ అకౌంట్‌‌లో కనీసం రెండేళ్లకు సరిపడా ప్రీమియం ఉండాలి. ఈ ఫీచర్‌‌‌‌ను  ఎల్‌‌ఐసీ పాలసీ తీసుకునేటప్పుడైనా లేదా ప్రీమియం చెల్లించేటప్పుడైనా ఎంచుకోవచ్చని ఎనలిస్టులు అంటున్నారు. ‘పీఎఫ్ అకౌంట్ ద్వారా ఎల్‌‌ఐసీ ప్రీమియం కట్టాలంటే మొదట ఈపీఎఫ్‌‌ఓ అకౌంట్‌‌ను , ఎల్‌‌ఐసీ పాలసీకి లింక్ చేయాలి. ఫార్మ్‌‌ 14 ను సబ్మిట్ చేయడం ద్వారా పాలసీని, పీఎఫ్‌‌ అకౌంట్‌‌ను లింక్ చేయడానికి ఈపీఎఫ్‌‌ఓకి, ఎల్‌‌ఐసీకి వీలుంటుంది. కాగా,  ఈ ఫెసిలిటీ ద్వారా కేవలం ఎల్‌‌ఐసీ పాలసీలకు మాత్రమే ప్రీమియం కట్టడానికే వీలుంటుంది. ఇతర కంపెనీల పాలసీలకు పీఎఫ్‌‌ అకౌంట్‌‌ ద్వారా ప్రీమియం కట్టలేం’ అని ట్రాన్సెండ్‌‌ క్యాపిటల్‌‌ డైరెక్టర్‌‌‌‌ (ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌) కార్తిక్ ఝవేరి అన్నారు. ఆర్థిక సమస్యలు తలెత్తినప్పుడు ఈ ఫెసిలిటీని వాడుకోవడం మంచిదని ఎనలిస్టులు సలహాయిస్తున్నారు. ‘కరోనా సంక్షోభం వలన ఆర్థికంగా నష్టపోయిన వారు ఈ ఫెసిలిటీని వాడుకోవచ్చు. ఒమిక్రాన్ వైరస్‌‌ కూడా విస్తరిస్తుండడంతో  తిరిగి పుంజుకోవడం కష్టంగా ఉందని భావిస్తున్నవాళ్లు తమ పీఎఫ్‌‌ అకౌంట్‌‌ నుంచి ఫ్యూచర్ కోసం ఎల్‌‌ఐసీ ప్రీమియం కట్టుకోవడం బెటర్‌‌‌‌. కానీ, పరిస్థితులు చక్కబడితే మాత్రం ఈ ఫెసిలిటీని  నిలిపివేయండి’ అని ఎనలిస్టులు సలహాయిస్తున్నారు.