నెలకు కాదు..ఇక నుంచి వారానికే జీతం

నెలకు కాదు..ఇక నుంచి వారానికే జీతం

న్యూఢిల్లీ: మనదేశంలో డిజిటల్​ లెండింగ్​ విపరీతంగా పెరుగుతోంది. నెల రోజుల తరువాత జీతం వచ్చే వరకు ఆగలేని వాళ్ల కోసం చాలా పే డే లోన్​ యాప్స్​ అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కొన్ని మోసపూరితమైనవీ ఉన్నాయి. ఇవి అధిక వడ్డీలు వసూలు చేస్తూ కస్టమర్ల వెన్ను విరుస్తున్నాయి. కిస్తీలు కట్టకుంటే చట్టవ్యతిరేక పద్ధతుల్లో సతాయిస్తున్నాయి. ఇవి అడ్డగోలుగా వడ్డీ వసూలు చేస్తున్నప్పటికీ ఎంతో మంది వీటిని తీసుకుంటున్నారు. రాజస్థాన్​ ప్రభుత్వం తన ఉద్యోగులు ఇలాంటి సమస్యలు ఎదుర్కోకుండా వడ్డీలేని అడ్వాన్సులు ఇస్తోంది. నెలాఖరుకు వచ్చే జీతం నుంచి వీటిని మినహాయించుకుంటున్నది. 

మిగతా ఎంప్లాయర్లు కూడా ఇలాంటి విధానాలకు మారాలని పర్సనల్​ ఫైనాన్స్​ ఎక్స్​పర్టులు సూచిస్తున్నారు. జీతంలో కనీసం సగం మొత్తాన్ని అడ్వాన్సుగా ఇవ్వాలి. ఇందుకు వడ్డీ వసూలు చేయకూడదు. దీనివల్ల తక్కువ జీతం ఉండే ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది. భారీ వడ్డీలు కట్టాల్సిన బాధ తప్పుతుంది. హఠాత్తుగా వచ్చే అనారోగ్యం, అంత్యక్రియలు వంటి ఖర్చులను తట్టుకోవచ్చు. మనదేశంలో ఇంటి నౌకరు మొదలుకొని సీఈఓ వరకు నెల రోజులకు ఒకసారి జీతం తీసుకుంటారు. దాదాపు 30 రోజుల వరకు డబ్బు చేతికి రాదు కాబట్టే పే డే యాప్స్ ​పుట్టుకువస్తున్నాయి. 

వారానికి ఒకసారి జీతం వస్తే ఇలాంటి యాప్స్​పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. భారతీయ జీతాల చట్టం ప్రకారం.. జీతాన్ని రోజు, వారం, 15 రోజులు, నెలవారీగా ఇవ్వొచ్చు. అన్ని కంపెనీలు నెల విధానాన్నే అనుసరిస్తున్నాయి. అమెరికాలో కేవలం 4.4 శాతం మంది ఉద్యోగులే నెలకు ఒకసారి జీతం తీసుకుంటారు. మిగతావారికి వారానికి, రెండువారాలకు  ఒకసారి జీతం ఇస్తారు.  

దూసుకెళ్తున్న డిజిటల్​ లెండింగ్​

వేతన జీవులు జీతం వచ్చే దాకా ఆగలేక  అప్పులు తీసుకోవడం పెరుగుతోంది. దీంతో డిజిటల్​ లెండింగ్​ కంపెనీలు, స్టార్టప్​ల పంటపండుతోంది. మనదేశంలో డిజిటల్ లెండింగ్​ మార్కెట్​ 2030 నాటికి 1.3 ట్రిలియన్​ డాలర్లకు పెరుగుతుందని అంచనా.  2022 లెండింగ్​ విలువ 270 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లతో పోలిస్తే ఇది ఐదు రెట్లు ఎక్కువ.  విదేశీ సంస్థలు ఇండియా డిజిటల్​ లెండింగ్ కంపెనీల్లో భారీగా ఇన్వెస్ట్​ చేస్తున్నారు.