ఐపీఓకి వస్తున్నపేటీఎం

ఐపీఓకి వస్తున్నపేటీఎం
  • ఇష్యూ సైజు రూ.21,500 కోట్లు?

ముంబై: మనదేశంలోనే ఇప్పటి వరకు అతిపెద్ద ఐపీఓకు ఫిన్​టెక్​ కంపెనీ పేటీఎం రెడీ అవుతోంది. ఇండియాలో అత్యధిక వాల్యుయేషన్ ఉన్న వాటిలో ఒకటైన పేటీఎం.. ఐపీఓ ద్వారా మూడు బిలియన్ డాలర్లు (దాదాపు రూ.21,500 కోట్లు) సేకరించాలని టార్గెట్​గా పెట్టుకుంది. సాఫ్ట్‌‌బ్యాంక్, అలీబాబా  బెర్క్‌‌షైర్ హాత్ వే వంటి బడా కంపెనీల ఇన్వెస్ట్మెంట్లు ఉన్న ఈ స్టార్టప్.. తన ఐపీఓ కోసం  లా ఫర్ములను కూడా నియమించుకుంది. ఇన్వెస్ట్ బ్యాంకులుగా మోర్గాన్ స్టాన్లీ, సిటీబ్యాంక్  జెపి మోర్గాన్లు పనిచేస్తాయి.  ‘‘ఐపీఓ పనుల కోసం  ఖైతాన్‌‌ అనే లా ఫర్మును పేటీఎం నియమించింది.  కంపెనీకి  ప్రధాన న్యాయ సలహాదారుగా ఖైతాన్ వ్యవహరిస్తుంది. సంస్థలో పెట్టుబడిదారుల తరఫున పనిచేయడానికి మరికొన్ని న్యాయ సంస్థలను కూడా నియమించారు. ఇన్వెస్ట్​మెంటు బ్యాంకులను  ఎంపిక చేశారు. ప్రస్తుతం ఐపీఓ ప్రాథమిక పనులు జరుగుతున్నాయి. ఎన్ని షేర్లు అమ్ముతారు ? ఇష్యూ తేదీ వంటి వివరాలు ఇంకా తెలియవు".   అని  పేరు చెప్పడానికి ఇష్టపడని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వెల్లడించారు. వన్97 కమ్యునికేషన్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట రిజిస్టర్ అయిన పేటీఎం ఈ ఐపీఓ గురించి చర్చించడానికే  శుక్రవారం బోర్డ్ మీటింగ్ నిర్వహించుకోనున్నట్టు సమాచారం. ఐపీఓ విషయమై మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. పేటీఎం ప్రతినిధి మాట్లాడేందుకు ఇష్టపడలేదు. 

బిగ్గెస్ట్​ ఐపీఓ 
ఇష్యూ ద్వారా పేటీఎం 3 బిలియన్ డాలర్లను సమీకరించగలిగితే మనదేశంలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ఐపీఓ అవుతుందని ఫైనాన్షియల్ ఎక్స్​పర్టులు చెబుతున్నారు. పేటీఎం 25 బిలియన్ డాలర్ల నుండి 30 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ ను టార్గెట్​గా పెట్టుకుందని  బ్లూమ్‌‌బెర్గ్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మనదేశంలో కోల్​ ఇండియా ఐపీఓకు అతిపెద్ద ఐపీఓగా పేరుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.15 వేల కోట్లను సమీకరించింది.  ఐపీఓ కోసం రెడీ అవుతున్న జొమాటో, కార్​ట్రేడ్, పాలసీబజార్,  మొబిక్విక్ వంటి టెక్నాలజీ కంపెనీల జాబితాలో ఇప్పుడు పేటీఎం కూడా చేరింది. జొమాటో రూ. 8,250 కోట్ల ఐపీఓ కోసం ఇది వరకు డాక్యుమెంట్లు దాఖలు చేయగా, కార్​ట్రేడ్ రూ.  2,000 కోట్లు సేకరించడానికి డ్రాఫ్ట్ పేపర్లను దాఖలు చేసింది. పాలసీబజార్,  మొబిక్విక్ తమ ఐపీఓల కోసం డాక్యుమెంట్లను అందజేయాల్సి ఉంది. " పేటిఎం ఐపీవో లోకల్ క్యాపిటల్ మార్కెట్లకు ఊపునిస్తుంది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఇట్లాంటి సంస్థలను డొమెస్టిక్ ఐపీఓలకు వెళ్లాలని  ప్రోత్సహిస్తోంది. అంతేగాక రూల్స్​ను కూడా ఈజీగా మార్చింది. పేపర్​ వర్కును తగ్గించింది”అని ఫైనాన్షియల్ ఎక్స్​పర్ట్ ఒకరు అన్నారు.   ఇండియా మర్చంట్ పేమెంట్స్ సెగ్మెంట్లో పేటీఎం మార్కెట్ లీడర్గా ఎదిగింది. ఈ స్టార్టప్​లో రెండు కోట్ల మందికిపైగా మర్చంట్ పార్ట్​నర్లు ఉన్నారు. ప్రతి నెలా 1.4 బిలియన్ల ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. కంపెనీ చరిత్రలో ఎన్నడూ లేనంత బిజినెస్​ను ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో సాధించామని ఇటీవలి కంపెనీ బ్లాగ్ పోస్ట్‌‌ ద్వారా సీఈఓ విజయశేఖర్ శర్మ వెల్లడించారు. డిజిటల్ చెల్లింపులతోపాటు బ్యాంకింగ్, క్రెడిట్ కార్డులు, ఆర్థిక సేవలు, వెల్త్ మేనేజ్మెంట్,  డిజిటల్ వాలెట్ సేవలను అందిస్తోంది. ఫోన్‌‌పే, గూగుల్ పే, అమెజాన్ పే , వాట్సాప్ పే వంటి గ్లోబల్ ప్లేయర్స్ నుండి పేటీఎం గట్టి పోటీని ఎదుర్కొంది.