Paytm ఆదాయం ఢమాల్.. రూ.500 కోట్లు నష్టం

Paytm ఆదాయం ఢమాల్.. రూ.500 కోట్లు నష్టం

Paytm పేమెంట్స్ చేసే వారికి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు.. గల్లీలోని బండి దగ్గర నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకు డబ్బుల చెల్లింపునకు ఉండే ఆప్షన్ ఇది. పేటీఎం వచ్చిన తర్వాత పేమెంట్స్ అనేది చాలా చాలా ఈజీ అయిపోయింది. జేబులో పైసా లేకపోయినా చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు.. చక చకా పని జరిగిపోయింది. పేటీఎంలో పేమెంట్ బ్యాంక్, వ్యాలెట్స్ అనేవి కూడా ఉన్నాయి. వీటిపై కొత్త ఆంక్షలు పెట్టింది. ఫిబ్రవరి 29వ తేదీ వరకు ఇవి పని చేయవని ప్రకటించింది. దీంతో పేటీఎం యూజర్లు షాక్ అయ్యారు. 

ఫిబ్రవరి 29వ తేదీ నాటికి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మూసివేయాలన్న ఆర్బీఐ ఆంక్షలతో.. పేటీఎం ఆదాయం భారీగా పడిపోనున్నట్లు చెబుతోంది కంపెనీ. ఏడాదికి కనీసంలో కనీసం 500 కోట్ల రూపాయల వరకు ఈ నష్టం ఉండొచ్చని అంచనా వేస్తుంది. పేమెంట్స్ బ్యాంక్ ద్వారా పేటీఎం ప్రతి ఏటా కనీసం 300 కోట్ల రూపాయల వరకు లాభాలను ఆర్జిస్తుంది. రాబోయే సంవత్సరాల్లో 500 కోట్ల రూపాయల వరకు లాభాలను ఆర్జించాలని టార్గెట్ పెట్టుకుంది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాలతో.. పేటీఎం లాభాలు భారీగా తగ్గనున్నాయని.. ఇది 500 కోట్ల రూపాయల వరకు ఉంటుందని కంపెనీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఫిబ్రవరి 29వ తేదీలోపు పేటీఎం పేమెంట్ బ్యాంక్ నుంచి డిపాజిట్లు, ఫాస్ట్ ట్యాగ్ రీ ఛార్జ్, మొబైల్ రీ ఛార్జ్ లు, ఓటీటీ పేమెంట్స్ వంటివి అన్నీ నిలిచిపోనున్నాయి. ఈలోపే కస్టమర్లు అందరూ తమ తమ ఖాతాలను ఖాళీ చేసుకోవాలని కూడా ఆర్బీఐ చెబుతుంది. ఈ నెల రోజుల్లో పేటీఎం నుంచి విత్ డ్రాలు వందల కోట్ల రూపాయలుగా ఉండనున్నాయి. ఇందుకు తగ్గట్టు కంపెనీ తమ కస్టమర్లకు ఆదేశాలు ఇస్తుంది. చూడాలి రాబోయే రోజుల్లో పేటీఎంపై మరిన్ని ఆంక్షలు ఉంటాయా లేదా అనేది.. ఎందుకంటే.. పేటీఎంలో చైనా పెట్టుబడులు ఉన్నాయనేది వాస్తవం కదా..