PBKS vs GT: గుజరాత్ సునాయాస విజయం.. ఆర్‌సీబీ అడుగుజాడల్లో పంజాబ్

 PBKS vs GT: గుజరాత్ సునాయాస విజయం.. ఆర్‌సీబీ అడుగుజాడల్లో పంజాబ్

పంజాబ్ కింగ్స్ మరో ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది. ఆదివారం(ఏప్రిల్ 21) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట గుజరాత్ బౌలర్లు విజృంభించడంతో పంజాబ్.. 142 పరుగులకే కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని శుభ్‌మన్ గిల్ సేన.. మరో 5 బంతులు మిగిలివుండగానే చేధించింది. గుజరాత్‌కిది నాలుగో విజయం కాగా, పంజాబ్‌కిది ఆరో ఓటమి. 

స్వల్ప చేధనలో గుజరాత్‌ పడుతూ లేస్తూ ప్రయాణం సాగించింది. లక్ష్యం చిన్నది కావడంతో టైటాన్స్ బ్యాటర్లు మందకొడిగా బ్యాటింగ్ చేశారు. మ్యాచ్ మధ్య భాగంలోకి వచ్చేసరికి అదే వారికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. కీలక సమయంలో లియామ్ లివింగ్‌స్టోన్.. శుభమాన్ గిల్(35), డేవిడ్ మిల్లర్(4)లను పెవిలియన్ చేర్చడంతో మ్యాచ్ ఆసక్తి రేకెత్తించింది. ఆ సమయంలో రాహుల్ తెవాటియా(36 నాటౌట్; 18 బంతుల్లో 7 ఫోర్లు) తాను ఎంత విలువైన ఆటగాడినో నిరూపించాడు. విజయానికి చివరి 4 ఓవర్లలో 38 పరుగులు కావాల్సివుండగా.. తెవాటియా బౌండరీల వర్షం కురిపించాడు. హర్‌ప్రీత్ బ్రార్ వేసిన 17వ ఓవర్‌లో 13 పరుగులు.. రబడ వేసిన 18వ ఓవర్‌లో 20 పరుగులు రాబట్టాడు. దీంతో మ్యాచ్ ఏకపక్షంగా మారిపోయింది. 

అంతకుముందు పంజాబ్‌ బ్యాటర్లకు వారి సొంతగడ్డపైనే గుజరాత్‌ బౌలర్లు చుక్కలు చూపించారు. ఒకవైపు వికెట్లు తీస్తూ.. మరోవైపు పరుగులు ఇవ్వకుండా కట్టడి చేస్తూ ముచ్చెమటలు పట్టించారు. ప్రభసిమ్రాన్ సింగ్(35; 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లు) టాప్ స్కోరర్. అతని తరువాత అంతో ఇంతో రాణించిన వాడంటే.. ఆ జట్టు స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్(5; 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లు). మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. దీంతో కింగ్స్.. నిర్ణీత ఓవర్లలో 142 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది.

పంజాబ్ 9.. ఆర్‌సీబీ 10

ప్రస్తుత 17వ సీజన్‌లో దాదాపు సగం మ్యాచ్‪లు గడిచాయి. గుజరాత్, పంజాబ్, ఢిల్లీ, బెంగళూరు జట్లు ఎనిమిదేసి మ్యాచ్‪లు ఆడగా.. మిగిలిన జట్లు ఏడేసిమ్యాచ్‪లు ఆడాయి. వీటన్నిటిలో అత్యంత దారుణ ప్రదర్శన కనపరిచిన జట్లు రెండే రెండు.. అందులో ఒకటి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కాగా, మరొకటి పంజాబ్ కింగ్స్. ఇతర జట్లు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకుతుంటే..  ఈ ఇరు జట్లు అట్టడుగు స్థానం కోసం పోటీ పడుతున్నాయి. ప్రస్తుతానికి ఆర్‌సీబీ  పదో స్థానంలో ఉండగా.. పంజాబ్ దానికి ఒక స్థానంపైన తొమ్మిదో స్థానంలో ఉంది.