PBKS vs GT: విజృంభించిన గుజరాత్‌ బౌలర్లు.. పంజాబ్ ఆలౌట్

PBKS vs GT: విజృంభించిన గుజరాత్‌ బౌలర్లు.. పంజాబ్ ఆలౌట్

ఎన్ని మ్యాచ్‌లు గడుస్తున్నా.. ఎన్ని ఫలితాలు వ్యతిరేకంగా వస్తున్నా.. పంజాబ్ టాపార్డర్ బ్యాటర్ల ఆటలో మాత్రం మార్పు రావడం లేదు. సామ్ కరన్‌, రిలీ రోసో, లియామ్ లివింగ్‌స్టోన్ రూపంలో పంజాబ్ జట్టులో ముగ్గురు విదేశీ ప్లేయర్లు ఉన్నారనే పేరు తప్ప.. వీరు బ్యాట్‌తో రాణించిన మ్యాచ్ ఒక్కటంటే ఒక్కటీ లేదు. వరుసగా విఫలమవుతూ జట్టుకు భారంగా మారుతున్నారు.  ఆదివారం(ఏప్రిల్ 21) ముల్లన్‌పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ త్రయం మరోసారి అలాంటి ప్రదర్శనే కనపరిచారు. ఫలితంగా, పంజాబ్ జట్టు మరో ఓటమికి అంచుల్లో నిల్చుంది.

సాయి కిషోర్(3 వికెట్లు), నూర్ అహ్మద్(2 వికెట్లు), మోహిత్ శర్మ(2 వికెట్లు) చెలరేగడంతో.. పంజాబ్ నిర్ణీత  ఓవర్లలో 142 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ప్రభసిమ్రాన్ సింగ్(35; 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ లు) టాప్ స్కోరర్. అతని తరువాత అంతో ఇంతో రాణించిన వాడంటే.. ఆ జట్టు స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్(29; 12 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్).  టెయిలెండర్ల సాయంతో బ్రార్.. వీలైనన్ని పరుగులు చేశాడు. గత కొన్ని మ్యాచ్‌లుగా ఆదుకుంటూ వస్తున్న శశాంక్‌ సింగ్‌ (8), అశుతోష్ శర్మ(3) జోడి ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు. దీంతో ఆ జట్టును కాపాడే వారే కరువయ్యారు. కెప్టెన్ సామ్ కరన్‌(20), రిలీ రోసో(9), లియామ్ లివింగ్‌స్టోన్(9), జితేష్ శర్మ(12) విఫలమయ్యారు.