
- ముస్లింలకు 10 % రిజర్వేషన్లు ఇస్తున్నమని అబద్ధాలు ప్రచారం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
కరీంనగర్/వరంగల్/వర్ధన్నపేట, వెలుగు: కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలతోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు పెండింగ్ లో పడిందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆరోపించారు. ముస్లింలకు 10% రిజర్వేషన్లు ఇస్తున్నామని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్ల పెంపుతో వారికి కొత్తగా పెరిగేది 1.8 శాతమేనని స్పష్టం చేశారు. సోమవారం రెండో విడత జనహిత పాదయాత్రను కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పరమల్యాలలో ప్రారంభించారు. అక్కడి నుంచి వరంగల్ జిల్లా వర్ధన్నపేట వరకు పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా కరీంనగర్జిల్లా గంగాధర మండలం వెంకటయ్యపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో అలాగే, వర్ధన్నపేటలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ లో కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. ఓట్ల చోరీతోనే మోదీ మూడోసారి గెలిచారని, పదవీ వ్యామోహం, అధికారకాంక్షతోనే బీజేపీ వాళ్లు ఓట్లు చోరీ చేశారని మండిపడ్డారు. సోనియా ప్రధాని కావాలనుకుంటే 2004లోనే అయ్యేవారని, రాహుల్ ప్రధాని అవ్వాలనుకుంటే వారు 2009 లోనే అయ్యేవారని, కానీ వాళ్లకు పదవుల మీద ఆశలు లేవన్నారు.
దేవుడి పేరు చెప్పకుండ బండి సంజయ్ మళ్లీ గెలుస్తారా అని సవాల్ విసిరారు. కరీంనగర్ లో రెండు ఇంటి నంబర్లలో కలిపి 44 ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. అందులో మనుషులు ఎవరూ ఉండని రేకుల షెడ్డు నంబర్ మీద 28 ఓట్లు ఉన్నాయన్నారు. కరీంనగర్ లోనూ ఓటు చోరీ జరిగిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. ‘‘ముందు మీ ఇంట్లో పంచాయితీ చక్కదిద్దుకోండి. మీ చెల్లెలితో ఆస్తుల పంచాయితీ సెటిల్ చేసుకోండి’’ అని సూచించారు.
బీజేపీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్‌గా ఎన్నికల కమిషన్: మీనాక్షి నటరాజన్
బీజేపీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా కేంద్ర ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. ఓట్ చోరీని ఆపాలంటే ఓటర్ లిస్ట్ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి మూడు నెలలకోసారి పేరుందో లేదో చెక్ చేసుకోవాలని సూచించారు. ‘‘అధికారంలో ఉన్నా ఎందుకు పాదయాత్ర చేస్తున్నారని కొందరు అడిగారు. అధికారంలోకి వచ్చాక కూడా ప్రజలకు ఇచ్చిన హామీల అమలును క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు పాదయాత్ర అవసరం’’ అన్నారు. తెలంగాణలో పేదల కోసం అనేక పథకాలు చేపడుతున్నారని తెలిపారు.