- అందుకే మతిభ్రమించి మాట్లాడుతున్నరు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- ప్రభుత్వాన్ని విమర్శించే ముందు కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలి
- 90 శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకుంటుంది
- హైదరాబాద్ చుట్టూ కేటీఆర్కు ఎన్ని భూములున్నాయో చెప్పాలి
- అసలైన రియల్టర్ కేటీఆరేనని ధ్వజం
హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ కు సిస్టర్ స్ట్రోక్, హరీశ్ కు మరదలు స్ట్రోక్ తగిలిందని, అందుకే మతిభ్రమించి మాట్లాడుతున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పదే పదే చిల్లర విమర్శలు చేసే కేటీఆర్, హరీశ్.. ముందు కవిత ప్రశ్నలకు జవాబివ్వాలని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ హయాంలో అవినీతి, పార్టీ పేరు మార్పుపై కవిత అడిగిన ప్రశ్నలకు కేటీఆర్, హరీశ్వద్ద సమాధానాలు లేవన్నారు. త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగుతామని, 90 శాతానికి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని చెప్పారు. పంచాయితీ ఎన్నికల్లో రెబల్స్, సమన్వయలోపం కారణంగా కొన్ని స్థానాలకు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామన్నారు. నిరుద్యోగుల ఉసురు తగిలే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని, పదేండ్లలో బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలు.. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన ఉద్యోగాలపై చర్చకు సిద్ధమని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో భూములు అమ్మిన చరిత్ర బీఆర్ఎస్ దేనని, అసలైన రియల్టర్ కేటీఆరేనని ధ్వజమెత్తారు. హైదరాబాద్ చుట్టూ కేటీఆర్ కు ఎన్ని భూములున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
తప్పుడు వార్తలు సరికాదు..
మంత్రులు, అధికారుల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా వార్తలు రాయడాన్ని మహేశ్ గౌడ్ ఖండించారు. బీజేపీ నేతలు జిల్లాల పేర్ల మార్పు సంగతి పక్కన పెట్టి, రాష్ట్రానికి కేంద్రం నుంచి తెచ్చిన నిధుల గురించి మాట్లాడాలన్నారు. దేవుడి పేరును వాడుకునే హక్కు బీజేపీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. సినిమా టికెట్ల రేట్లు సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల కృషి వల్లే చిత్రసీమ మద్రాస్ నుంచి హైదరాబాద్ కు వచ్చిందన్నారు.
