లీడర్లను, ఓట్లను కొంటవ్​.. వడ్లు కొనవా?

లీడర్లను, ఓట్లను కొంటవ్​.. వడ్లు కొనవా?
  • వానాకాలం వడ్లు కొనకుండా యాసంగిపై మాట్లాడుడేంది?: రేవంత్​

కామారెడ్డి , వెలుగు: వానాకాలం వడ్లు కొనకుండా యాసంగిలో పండే వడ్లను కేంద్రం కొంటదా? లేదా? అని సీఎం  కేసీఆర్​ మాట్లాడుడు ఏందని, ముందుగా రోడ్లపై, కల్లాల్లో, సెంటర్లలో కుప్పలుగా పడి ఉన్న వడ్లను రాష్ట్ర ప్రభుత్వం కొనాలని పీపీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి డిమాండ్​ చేశారు.  నెల రోజులుగా రోడ్లపై వడ్ల కుప్పలు పోసుకొని రైతులు కష్టాలు పడుతున్నా, ఒత్తిడితో కుప్పలపైనే రైతుల ప్రాణాలు పోతున్నా కేసీఆర్​లో చలనం కనిపించడం లేదని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులను, ఓట్లను ఎంత రేటు పెట్టయినా కొనే కేసీఆర్​కు రైతులు పండించిన వడ్లను కొనడం చేతగావడం లేదని రేవంత్​ విమర్శించారు. ప్రజాప్రతినిధులను, ఉప ఎన్నికల్లో ఓటర్లను కొనేటప్పుడు లేని ఓటీపీ సిస్టం రైతుల విషయంలో ఎందుకని ప్రశ్నించారు.  రూ. లక్ష రుణ మాఫీ చేస్తానని చెప్పి దాన్ని చేయలేదని, పంట అమ్ముకుంటే వచ్చే సొమ్మును బ్యాంక్​ వాళ్లు అప్పు కింద జమ చేసుకుంటున్నారని, దీంతోనే ఓటీపీ సిస్టమ్​ పెట్టారని ఆరోపించారు. స్టేట్​లో వైన్​ షాపుల అప్లికేషన్లకు వచ్చిన రూ. 1,200 కోట్లతో 70 లక్షల టన్నుల వడ్లు కొనవచ్చన్నారు. ‘కల్లాల్లోకి కాంగ్రెస్​ పార్టీ’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కామారెడ్డి జిల్లాలో రేవంత్​రెడ్డి పర్యటించారు. కల్లాల వద్దకు వెళ్లి వడ్ల కుప్పలను పరిశీలించారు. అక్కడున్న రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. రైతులు ఎవరూ ధైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలు చేసుకొవద్దని రేవంత్​ విజ్ఞప్తిచేశారు. కామారెడ్డి, లింగంపేటలో మీడియాతో మాట్లాడారు.  ప్రగతిభవన్​లోనో, గజ్వేల్​లోని ఫామ్​హౌస్​లోనో కేసీఆర్​ పడుకోవడం కాదని, కామారెడ్డి జిల్లాకు వచ్చి వడ్ల కుప్పల వద్ద పడుకుంటే రైతుల కష్టాలు తెలుస్తాయన్నారు.

టీఆర్​ఎస్​, బీజేపీ లీడర్లను నిలదీయాలె

వడ్లు కొనకుంటే గ్రామాలకు వచ్చే టీఆర్​ఎస్​, బీజేపీ లీడర్లను రైతులు నిలదీయాలని రేవంత్  అన్నారు. ‘‘పత్తికి గులాబీ చీడ పురుగు పడితే మందు కొట్టాల్సిందే. గట్లనే  స్టేట్​కు గులాబీ చీడ పురుగు పట్టింది. ఈ పురుగును తొలగించాలంటే టీఆర్​ఎస్​ వాళ్లను నిలదీయాలె” అని చెప్పారు.  ‘‘వానాకాలం వడ్లు కల్లాల్లో ఉంటే వాటిని కొనకుండా కేసీఆర్.. యాసంగిలో వడ్లు కేంద్రం కొంటదా ? లేదా? అంటూ ఇందిరాపార్కు దగ్గర ధర్నా చేయడం ఏంది? కేసీఆర్​ ధర్నా చేయాల్సింది ఇందిరా పార్కు దగ్గర కాదు.. ప్రధాని మోడీ ఇంటి ముందు చేయాలె. వస్తానంటే మేమే స్వయంగా ఢిల్లీ తోల్కపోయి కూర్చోబెడుతం” అని చెప్పారు. కాళేశ్వరం కమీషన్​లో, మిషన్​భగీరథ కింద దోచుకున్న సొమ్మునో,  హైదరాబాద్​లో ఆక్రమించిన భూముల పైసలో రైతులు అడగడం లేదని, వడ్లు కొనుమంటున్నారని అన్నారు. వడ్ల కొనుగోలుపై టీఆర్​ఎస్​, బీజేపీ వీధి నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ఉద్యమ సమయంలో జాయింట్  యాక్షన్ కమిటీ ఉండేదని, ఇప్పుడు  సీఎం కేసీఆర్​, బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్ కలిసి డ్రామా యాక్షన్ అనే కొత్త కంపెనీని తెరపైకి తెచ్చారని ఎద్దేవా చేశారు. వడ్లను ఎఫ్​సీఐతో  కొనిపించలేని సంజయ్​ నల్గొండకు పోయి ఏం చేశారో చెప్పాలని రేవంత్​ ప్రశ్నించారు. రైతులతో పెట్టుకున్నోళ్లు ఎవరూ బతికి బట్టకట్టలేదని, ఇప్పుడు కేసీఆర్​ రైతులతో పెట్టుకున్నారని అన్నారు. సాగు చట్టాల రద్దుకు కేంద్రం తీసుకున్న నిర్ణయం రైతుల విజయమని చెప్పారు. హర్యానా, పంజాబ్​ రైతులను స్ఫూర్తిగా తీసుకొని మన రైతులు పోరాటం చేయాలనిపిలుపునిచ్చారు. మన రాష్ట్ర రైతుల సమస్యలపై ఈ నెల 29 నుంచి జరిగే పార్లమెంట్​  సమావేశాల్లో ప్రధాని మోడీని నిలదీస్తామని తెలిపారు. అసెంబ్లీలోనూ పోరాటం చేస్తామన్నారు.

రైతులకు ఆర్థిక సాయం

వడ్ల కుప్ప వద్ద చనిపోయిన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఐలాపూర్​కు చెందిన రైతు బీరయ్య కుటుంబానికి రూ. లక్ష, నల్లమడుగుకు చెందిన రైతు నరేందర్​ పంట కుప్ప వద్ద పాము కాటుతో చనిపోగా ఆయన ఫ్యామిలీకి రూ.లక్ష చొప్పున రేవంత్​ ఆర్థిక సాయం అందజేశారు.  రేవంత్​తో పాటు మాజీ మంత్రి షబ్బీర్​ అలీ,  మాజీ ఎంపీ సురేశ్ ​షెట్కార్​, మాజీ ఎమ్మెల్యే గంగారాం తదితరులు పాల్గొన్నారు.