సాయుధ పోరాటంతో ఈ పార్టీలకు సంబంధమే లేదు 

సాయుధ పోరాటంతో ఈ పార్టీలకు సంబంధమే లేదు 
  • బీజేపీ, టీఆర్ఎస్ చరిత్రను వక్రీకరిస్తున్నయ్: రేవంత్ 
  • సాయుధ పోరాటంతో ఈ పార్టీలకు సంబంధమే లేదు 
  • పవర్​లోకి వస్తే ‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గీతంగా ప్రకటిస్తమని వెల్లడి
  • తెలంగాణ తల్లి విగ్రహ నమూనా విడుదల

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ చరిత్రను బీజేపీ, టీఆర్‌‌‌‌ఎస్ వక్రీకరిస్తున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్‌‌ రెడ్డి మండిపడ్డారు. తమ రాజకీయ లబ్ధి కోసం నాటి ఉద్యమాన్ని వక్రీకరించి.. కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నాయని ఫైర్ అయ్యారు. సాయుధ పోరాటం గురించి మాట్లాడే అర్హత కూడా ఆ పార్టీలకు లేదన్నారు. అసలు అప్పటికింకా ఇవి పుట్టనే లేదన్నారు. శనివారం గాంధీభవన్‌‌లో నిర్వహించిన సెప్టెంబర్ 17 వేడుకల్లో రేవంత్‌‌ మాట్లాడారు. సీఎం కేసీఆర్‌‌ తన చరిత్ర, తన కుటుంబ చరిత్రను గొప్పగా రాసుకోవడానికి అసలు చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

అధికారంలోకి వచ్చిన 8 ఏండ్ల తర్వాత ఆయన‌‌‌‌కు సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 17 యాదికొచ్చిందా? అని ప్రశ్నించారు. ‘‘ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలతో అమి త్‌‌‌‌షా తెలంగాణకు వచ్చి వివిధ కార్యక్రమాలు చేస్తున్నట్టే.. అప్పటి ప్రధాని నెహ్రూ ఆదేశాల మేరకు నాటి హోంమంత్రి పటేల్‌‌‌‌ ఆపరేషన్ పోలో చేపట్టారు. నిజాం, భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజలు, మేధా వులు, కాంగ్రెస్‌‌‌‌, కమ్యూనిస్టు నాయకులు పోరాటం చేశారు. ఆ పోరాటం వల్లే మనకు స్వేచ్ఛ లభించింది. నాటి పోరాట వీరుల చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. చెప్పుకోవడానికి చరిత్ర లేని బీజేపీ.. కాంగ్రెస్ నాయకుడైన వల్లభాయ్‌‌‌‌ పటేల్‌‌‌‌ను తమవాడిగా చెప్పుకునేందుకు తాపత్రయపడుతోందని ఫైర్ అయ్యారు. ఎవరెన్ని చేసినా పటేల్ కాంగ్రెస్ వ్యక్తేనని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌కు (గాంధీభవన్‌‌‌‌) పునాది రాయి వేసింది ఆయనేనని గుర్తు చేశారు. 

కొత్త జెండాకు ఆలోచనలు పంపండి.. 
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీఎస్‌‌‌‌ను టీజీగా మారుస్తామని మరోసారి రేవంత్​ రెడ్డి చెప్పారు. అందెశ్రీ రాసిన ‘‘జయజయహే తెలంగాణ” పాటను రాష్ట్ర గీతంగా చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను విడుదల చేశారు. రాష్ట్రంలో ఎవరైనా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. రాష్ట్రానికి కొత్త జెండా రూపొందిస్తామన్నారు. ఇందుకోసం యువత, కవులు, కళాకారులు, మేధావులు తమ ఆలోచనలు పంపాలని సూచించారు.

టీజీ ట్యాగ్​లైన్​తో..రాహుల్​ విషెస్సాయుధ తెలంగాణ పోరాట స్ఫూర్తి ఎప్పటికీ కొనసాగించాలని కాంగ్రెస్ లీడర్‌‌‌‌‌‌‌‌ రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17 అనేది తెలంగాణ ప్రజలందరికీ శుభదినమని పేర్కొంటూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు శనివారం ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌లో ‘టీజీ’ అని ట్యాగ్​ చేస్తూ రాహుల్ ఈ పోస్ట్ చేశారు. ‘‘భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంకెళ్ల విముక్తి కోసం.. తెలంగాణ రైతాంగ పోరాటంతో మొదలుపెట్టి.. భారత సైన్యం సాయంతో లక్ష్యాన్ని సాధించి.. త్రివర్ణ పతాకాన్ని తెలంగాణ ప్రజలు ముద్దాడిన శుభదినం. అదే స్ఫూర్తిని ఎప్పటికీ కొనసాగించాలని ఆశిస్తూ.. తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు” అని రాహుల్​ పేర్కొన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే.. ‘టీఎస్’ను ‘టీజీ’గా మారుస్తామని రేవంత్​ కొన్ని రోజుల కింద ప్రకటించిన నేపథ్యంలో రాహుల్​ కూడా పోస్టు చేయడం గమనార్హం.