ఆ కార్ల ఓనర్ల పేర్లను ఎందుకు దాస్తున్నారు?

 ఆ కార్ల ఓనర్ల పేర్లను ఎందుకు దాస్తున్నారు?

జూబ్లీహిల్స్ బాలిక కేసులో పూర్తిగా నిజాలు చెప్తూనే కొన్ని ఆధారాలను హైదరాబాద్ సీపీ ఆనంద్ కప్పిపుచ్చుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనలో  వినియోగించిన ఇన్నోవా కారు ప్రభుత్వ వాహనమని లోకమంతా కోడై కూస్తున్నా ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు.  మైనర్లు కారును నడిపినప్పుడు తక్షణమే యాజమానులకి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు.  ఆ కార్ల ఓనర్లను మోటార్ యాక్ట్ 133 ప్రకారం..  పోలీస్ స్టేషన్ కి పిలిపించి విచారించాలని అన్నారు. ఆ కారు ఓనర్ల పేర్లను ఎందుకు దాస్తున్నారో  సీపీ ఆనంద్ చెప్పాలని అన్నారు.  సెక్షన్ 13 పోక్సో చట్టం ప్రకారం ఆ కార్ల ఓనర్ లపై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.  అత్యాచారం జరిగిన రెండు రోజుల వరకు ఇన్నోవా కారు ఎక్కడ పోయిందని  రేవంత్ ప్రశ్నించారు.  

ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించాల్సిన కారుని అసాంఘిక కార్యక్రమాలకు ఎలా వినియోగిస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు. కారులో ఉన్న అన్ని ఆధారాలను తొలగించిన తర్వాతే .. పోలీసులకు దొరికిందని రేవంత్ ఆరోపించారు.  ఈ కేసులో అత్యంత కీలకమైన నాయకుల పిల్లల పైన ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. విశ్వనగరంగా  కావలసిన హైదరాబాద్ ని కేసీఆర్, కేటీఆర్ విషపు నగరంగా మార్చారని రేవంత్  విమర్శించారు.  గత వారం రోజుల్లో మైనర్ లపై అత్యాచారాలు జరిగాయని, దీనికి  కారణం పబ్బులు, డ్రగ్స్ , గంజాయి అని అన్నారు.  కేసీఆర్ సీఎం అయ్యాక హైదరాబాద్ లో 150 పబ్బులకి అనుమతి ఇచ్చారని, లిక్కర్ యజమానులు మొత్తం కల్వకుంట్ల కేసీఆర్ చుట్టలేనని రేవంత్ అన్నారు.  అంతార్జతీయ విమనాశ్రయం పేరు చెప్పుకొని రాష్ట్ర ప్రభుత్వము బ్రోకర్ హౌస్ నడుపుతుందని రేవంత్  విమర్శలు గుప్పించారు.