పార్టీ ఫిరాయింపుల్లో మోడీకి కేసీఆరే ఆదర్శం

పార్టీ ఫిరాయింపుల్లో మోడీకి కేసీఆరే ఆదర్శం

పార్టీ ఫిరాయింపుల విషయంలో ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ ఆదర్శమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. 2014లో ఏర్పడ్డ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మొట్టమొదట ఏక్ నాథ్ షిండేలను ప్రవేశపెట్టారని అన్నారు. ఏక్ నాథ్ షిండేల ఉత్పత్తి కార్మగారం ప్రారంభించిందే కేసీఆర్ అని, ఆ పేటెంటు, ఆ బ్రాండు సీఎం కేసీఆర్ కే దక్కుతుందని చెప్పారు. ‘నీ పార్టీ నుంచి గెలవకపోయినా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించి తెలుగుదేశంను చీల్చారని మండిపడ్డారు. తలసాని, సబిత, ఎర్రబెల్లి లాంటి ఎంతో మంది షిండేలను చేర్చుకొని, ఫిరాయింపులను ఉల్లఘించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. టీడీపీ, కాంగ్రెస్ నేతలనే కాకుండా చివరకు కమ్యూనిస్టులను కూడా చేర్చుకున్న ఘనత కేసీఆర్ సొంతమ ఎద్దేవా చేశారు. 

కేసీఆర్ కనిపెట్టిన ఫార్మూలానే (పార్టీ ఫిరాయింపులు) ఇవాళ ఆయనను కబళించడానికి ముందుకొస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ కేబినెట్ లో ఉన్నవారంతా ఏక్ నాథ్ షిండేలేనని, ఒక్కరైనా తెలంగాణ కోసం కొట్లాడినవాళ్లు ఉన్నారా..? మీ పార్టీలో పుట్టినోళ్లు ఒక్కరైనా ఉన్నారా..? అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఒక్కడే ఏక్ నాథ్ షిండే ఉన్నాడు గానీ, టీఆర్ఎస్ లో మాత్రం 100 మంది ఏక్ నాథ్ షిండేలను ఉత్పత్తి చేశారని ఆరోపించారు. ఏక్ నాథ్ షిండేలకు గాడ్ ఫాదర్ లాంటి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్లు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారని సెటైర్ వేశారు. 

కేంద్రం (మోడీ) తీసుకున్న చాలా నిర్ణయాల్లో కేసీఆర్ పాత్ర కూడా ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రెండు పార్టీల మధ్య వాటాల తేడా రావడం వల్లే ఇవాళ బీజేపీని కేసీఆర్ తిడుతున్నారని అన్నారు. బతికి ఉన్నప్పుడు రైతులను పట్టించుకోకుండా చనిపోయిన తర్వాత కేసీఆర్ రైతు బీమా ఇస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు మానవ సంబంధాలు లేవని, కేవలం ఆర్థిక లావాదేవీలతో కూడుకున్న బంధమే ఉందని, కనీసం మానవ విలువలు లేవని రేవంత్ విమర్శించారు. కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినప్పుడు టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు వ్యతిరేకించలేదని నిలదీశారు. మోడీ, కేసీఆర్ మధ్య లావాదేవీల పంచాయితీ వచ్చిందన్న రేవంత్.. ముఖ్యమంత్రిని చివరకు ఆయన కుటుంబ సభ్యులు కూడా నమ్మరని సెటైర్ వేశారు. 

కేసీఆర్ కు శ్రీలంక భయం పట్టుకుంది
శ్రీలంక ప్రధాని పరిస్థితి చూసి సీఎం కేసీఆర్ కు భయం పట్టుకుందని రేవంత్ రెడ్డి అన్నారు. శ్రీలంకలో మాదిరిగా రాష్ట్రంలో ప్రజలు తిరగబడి ఫామ్ హౌజ్ పైకి వస్తారనే ఆందోళన చెందుతున్భనాడని చెప్పారు. మోడీ, కేసీఆర్ లది దోపిడీ బంధం అని ఆరోపించారు. హైదరాబాద్ లో ఈ మధ్య  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు పెట్టుబడి సమకూర్చింది కేసీఆర్ తో పాటు ఆయనకు సంబంధించిన పెట్టుబడిదారులు కదా..? అని రేవంత్ ప్రశ్నించారు. ఆ కారణంగానే మోడీ పరేడ్ గ్రౌండ్స్ సభలో సీఎం కేసీఆర్ పై ఒక్క విమర్శ కూడా చేయలేదని అన్నారు. టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చుకుండా ఎవరు అడ్డుకున్నారో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 2004లో కడప, నంద్యాలలోనూ టీఆర్ఎస్ కారు గుర్తుపై పోటీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనాడే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని కేసీఆర్ నిబంధనలను ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎంపీలను బీజేపీలోకి పంపితే రాష్ట్రం మొత్తం అభివృద్ధి అవుతుంది కదా..? అని చురకలంటించారు.

కేసీఆర్ ను 100 సార్లు ఊరితీయాలి
తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని చంపింది కేసీఆర్ అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఏ సంఘాన్ని కూడా బతకనీయకుండా చేశాడని, అన్ని సంఘాలను నిర్వీర్యం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిన నేరాలకు ఆయన్ను 100 సార్లు ఊరి తీయాలని అన్నారు. తప్పు చేస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పే కేసీఆర్ ను ప్రజలు రాళ్లతో కొట్టే రోజులు వస్తాయని చెప్పారు.  కేసీఆర్ ను రాళ్లతో తరిమికొట్టి, గుణపాఠం చెప్పడానికి తెలంగాణ సమాజం సిద్దంగా ఉందని రేవంత్ స్పష్టం చేశారు. 

ముందస్తు ఎలక్షన్స్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ నాటకాలు
ముందస్తు ఎలక్షన్స్ కు వెళ్లాలనుకుంటే ముందు కేబినెట్ ను సమావేశపరిచి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ముందస్తు విషయంలో మోడీ, కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ‘కేసీఆర్ కు నాలుగు రోజులు సమయం ఇస్తున్నా. నీలో పోరాట పటిమ ఉంటే మీ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎలక్షన్స్ కు రండి. ఉన్న పళంగా ఎన్నికలకు వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ కూడా ముందస్తు ఎలక్షన్స్ కు ఉవ్విళ్లూరుతోంది’ అంటూ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. 

రాబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ దే అధికారం
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 లక్షల ఓట్లు తెచ్చుకుని రాష్ట్రంలో అధికారం చేపడుతుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ విధానాలను, నాటకాలను ప్రజల ముందు పెడుతామన్నారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కేసీఆర్ ను కాలగర్భంలో కలిపేందుకు అన్ని వర్గాల వాళ్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

చలో సిరిసిల్లకు కాంగ్రెస్ పిలుపు
చలో సిరిసిల్ల కార్యక్రమానికి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.  ఆగస్టు 2వ తేదీన నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ వస్తున్నారని చెప్పారు. 

గజ్వేల్ లో కాంగ్రెస్ అభ్యర్థే కేసీఆర్ ను ఓడిస్తాడు
గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ను (ప్రస్తుతం గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్) కాంగ్రెస్ అభ్యర్థే ఓడిస్తారని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కేసీఆర్ పై పోటీ చేస్తానని చెప్పినా, ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో స్పష్టం చెప్పలేదని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మంచి అభ్యర్థులను బరిలో దింపుతామన్నారు. రాష్ట్రానికి సేవ చేయాలనుకునే వారు కాంగ్రెస్ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు అవుతారని అన్నారు. గతంలో 2004, 2009, 2014లోనూ ఎన్నికల సమయంలో హంగ్ ఏర్పడుతుందనే చర్చ సాగిందని, రాబోయే ఎన్నికల్లో అలాంటి ప్రభుత్వం ఏర్పాటు కాదని అన్నారు. రాష్ట్ర ప్రజలు వ్యూహాత్మకంగా ఓటేస్తారని, ఈ విషయంలో రాజకీయ పార్టీలకే వ్యూహాం లేదన్నారు. ఎవర్ని ఎప్పుడు ఓడించాలో.. ఎప్పుడో  గెలింపించాలో ప్రజలకు స్పష్టంగా తెలుసని 2023 నుంచి 2033 వరకూ కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని రేవంత్ జోస్యం చెప్పారు.