తెలంగాణను మోసం చేసిందే కేసీఆర్: రేవంత్

తెలంగాణను  మోసం చేసిందే కేసీఆర్: రేవంత్
  •     రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌కు వచ్చేది 25 సీట్లే
  •     అందుకే కాంగ్రెస్‌‌పై కేసీఆర్ దాడి చేస్తున్నారని ఆరోపణ 
  •     తానెక్కడున్నా తెలంగాణ ప్రయోజనాల కోసమే కొట్లాడానని కామెంట్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణను మోసం చేసిందే కేసీఆర్ అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 1996లో 610 జీవో, జోనల్ వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడిన ద్రోహి అని ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 25 సీట్లకు మించి రావని, అందుకే కాంగ్రెస్‌‌పై కేసీఆర్ దాడి చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీని చిల్లర రాజకీయాలకు వేదికగా కేసీఆర్ అండ్ కో మార్చారని ఫైర్ అయ్యారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘‘తన గళం, కలంతో జీవితాంతం పేద ప్రజల కోసం పోరాడిన ప్రజా యుద్ధ నౌక గద్దర్‌‌‌‌కు అసెంబ్లీలో సంతాపం తెలపకపోవడం దారుణం. కేసీఆర్ రెండున్నర గంటల ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు” అని మండిపడ్డారు. గద్దర్ 2019లో మొదలు పెట్టిన తుది దశ తెలంగాణ ఉద్యమం సాకారం కావాలని అన్నారు. గద్దర్ చివరి కోరిక, ఆకాంక్ష నెరవేర్చేందుకు ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. ‘‘నిక్కర్ పార్టీ, లిక్కర్ పార్టీ ఒక్కటయ్యాయని గద్దరన్న నాతో చెప్పారు. యుద్ధం వ్యూహాత్మకంగా చేయాలని సూచించారు. కేసీఆర్ క్రిమినల్ పొలిటీషియన్ అని, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. గద్దర్ అంత్యక్రియల టైంలో వివాదం చేయొద్దని విజ్ఞతతో వ్యవహరించినం. లేదంటే తండ్రీ కొడుకులు ఎల్బీ స్టేడియం నుంచి మంచి దుస్తులతో బయటకు వెళ్లే వాళ్లు కాదు. ప్రజల గుండెల్లో గద్దర్ వీరుడిగా నిలబడితే, ప్రజాకోర్టులో కేసీఆర్ ఇప్పటికే దోషిగా నిలబడ్డారు” అని అన్నారు. తెలంగాణ ద్రోహులతో అంటకాగిన కేసీఆర్ దుర్మార్గుడని, లాలూచీలో కేసీఆర్ ను మించిన వారు దేశంలో ఇక పుట్టరన్నారు. ఏ రోకటి కాడ ఆ పాట పాడే వ్యక్తి కేసీఆర్ అని ఆరోపించారు.

ఏ స్థాయిలోనైనా తెలంగాణ పక్షానే ఉన్నా

1996లో 610 జీవోను, జోనల్ విధానాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలో మాట్లాడిన ద్రోహి కేసీఆర్ అని రేవంత్ రెడ్డి విమర్శించారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ కల సాకారమైందని అసెంబ్లీ వేదికగా 2014 జూన్ 13న చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు కాంగ్రెస్‌‌ను, తనను దోషిగా ఎలా నిలబెడతారని ప్రశ్నించారు. ‘‘పదే పదే నన్ను చంద్రబాబు శిష్యుడినని తండ్రీ, కొడుకులు విమర్శిస్తున్నారు. కానీ నేను చంద్రబాబుకు సహచరుడిని మాత్రమే. నా ప్రస్థానం టీడీపీలో చంద్రబాబు సహచరుడిగా మొదలైంది. ఎమ్మెల్సీగా గెలిచాకే టీడీపీలో చేరాను. కానీ నిలువ నీడ లేని కేసీఆర్‌‌‌‌కు టీడీపీనే ఆధారమైంది. కేసీఆర్ చంద్రబాబుతో ఉన్నప్పుడు 610 జీవోపై తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసేలా వ్యవహరించారు” అని ఆరోపించారు. తాను ఏ స్థాయిలో ఉన్నా తెలంగాణ పక్షానే ఉన్నానని చెప్పారు. గతంలో టీడీపీలో ఉన్నా, ఇప్పుడు పీసీసీ చీఫ్‌‌గా ఉన్నా.. ఎప్పుడూ, ఎక్కడా తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడలేదన్నారు. వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, జైపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి లాంటి కాంగ్రెస్ నాయకులు హైకమాండ్‌‌ను వ్యతిరేకించి తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లేనని గుర్తు చేశారు.

కేసీఆర్ అనుభవిస్తున్నది కాంగ్రెస్ భిక్షే

కేసీఆర్ కుటుంబం ఇప్పుడు అనుభవిస్తున్నదంతా కాంగ్రెస్ భిక్షనే అని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ‘‘కాంగ్రెస్ లేకపోతే కేసీఆర్ కుటుంబం బిచ్చమెత్తుకునేది. టీడీపీ, కాంగ్రెస్ లేకుంటే.. కేసీఆర్ కుటుంబ సభ్యులు నాంపల్లి దర్గా, బిర్లా మందిర్, మెదక్ చర్చ్ ముందు చిప్పలు పట్టుకుని అడ్డుకునే వాళ్లు. కేసీఆర్‌‌‌‌ని కేంద్ర మంత్రిని చేసిందే కాంగ్రెస్. ఎమ్మెల్యేగా గెలవకపోయినా హరీశ్‌‌ రావు ను మంత్రిని చేసింది. టీడీపీ, కాంగ్రెస్ లో ఉండి తెలంగాణకు మోసం చేసింది కేసీఆర్. టీడీపీ, కాంగ్రెస్ నష్టం చేశాయని చెప్పే కేసీఆర్.. అప్పుడు ఎన్నికల్లో వాటితోనే ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? పార్టీ పెట్టేందుకు ఆఫీస్ ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వ్యక్తి చనిపోతే కనీసం నివాళి అర్పించేందుకు వెళ్లని కుసంస్కారి కేసీఆర్” అని ఆరోపించారు. తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహంపై అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ రాలేకపోతే కనీసం కొడుకు కేటీఆర్, అల్లుడు హరీశ్‌‌ నైనా పంపాలన్నారు.