TRSకు బీజేపీని వ్యతిరేకించే ధైర్యముందా?

TRSకు బీజేపీని వ్యతిరేకించే ధైర్యముందా?
  • దమ్ముంటే సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి
  • సీఎం కేసీఆర్ కు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ సవాల్

నల్లగొండ :  మున్సిపల్ ఎన్నికల్లో ముస్లింలు TRSకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. బీజేపీ సారథ్యంలోని కేంద్ర సర్కార్ రాజ్యాంగ విరుద్ధంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) తెచ్చిందని, దాన్ని తప్పు పట్టే ధైర్యం టీఆర్ఎస్ కు లేదని అన్నారాయన. నల్లగొండలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తమ్ మాట్లాడుతూ ఇప్పటి వరకూ బీజేపీకి సహకరిస్తూ వచ్చిన టీఆర్ఎస్ కు నేడ వ్యతిరేకించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కు దమ్ముంటే సీఏఏని అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని సవాలు విసిరారు.
మంత్రిగా కేటీఆర్ అట్టర్ ఫ్లాప్
అధికారం ఉన్నది కాబట్టి తమకే ఓటు వేయాలనడం అర్ధరహితమంటూ మంత్రుల ప్రచార తీరును తప్పుబట్టారు ఉత్తమ్. పట్టణ ప్రాంత ప్రజల సమస్యల పరిస్కారంలో తండ్రి కొడుకులు ఇద్దరు ఫెయిల్ అయ్యారని అన్నారు. మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ అట్టర్ ప్లాప్ అయ్యారన్నారు. నిరుద్యోగ భృతి రావాలంటే యువత టీఆరెస్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఉత్తమ్. రైతు రుణమాఫీ రావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెసు మేనిఫెస్టోలో ప్రజలకు మేలు చేసే అంశాలను పొందుపరిచామని చెప్పారు. మెజార్టీ మున్సిపాలిటీల్లో కాంగ్రెసు జెండా ఎగరబోతోందన్నారు. పార్టీ కార్యకర్తలంతా అభ్యర్థుల గెలుపుకోసం ఐకమత్యంగా కృషి చేయాలని కోరారు.