కరోనా కట్టడిలో తెలంగాణ పూర్తిగా విఫలం అయ్యిందని, టెస్టుల సంఖ్య ఇంకా పెంచాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. స్పీక్ అప్ తెలంగాణ ఆన్లైన్ ప్రచారం లో భాగంగా మాట్లాడిన ఆయన అసెంబ్లీ వేదికగా కేసీఆర్ అనాలోచితంగా మాట్లాడారని, పారాసిటమాల్ టాబ్లెట్ తో పోతుందని, 22 డిగ్రీల ఉష్ణోగ్రతలు వస్తే వైరస్ మాడిపోతుందన్న విషయాన్ని గుర్తు చేశారు.
కరోనా వైరస్ ట్రీట్‌మెంట్ విషయంలో కేసీఆర్ ఘోరంగా వైఫల్యం చెందారని, జాతీయ మీడియా సైతం ఇదే విషయాన్ని చెబుతుందని ఉత్తమ్ అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులలో ఫీజుల నియంత్రణ లేకుండా పోయిందని, దీంతో పేదలు, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. నిజామాబాద్ లో, హైదరాబాద్ లో ఆక్సిజన్ లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీలో చేర్చాలని, కరోనా కారణంగా మరణించిన పేదలకు 10లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో టెస్టులు తక్కువ చేస్తూ తెలంగాణ సమాజాన్ని సీఎం కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నాడన్నారు ఉత్తమ్. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో 15 లక్షలు, చిన్న రాష్ట్రమైన ఢిల్లీలో 16 లక్షల టెస్ట్ లు ఇస్తే… తెలంగాణలో కేవలం రెండు లక్షలు మాత్రమే కరోనా టెస్టులు చేశారన్నారు. మార్చి లో కరోనా ఉధృతి మొదలయితే జూలై వరకు ఆసుపత్రుల్లో ఎందుకు వసతులు కల్పించలేదని ప్రశ్నించారు. కరోనా నివారణ కోసం ముందుండి పని చేస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, పోలీసులు, జర్నలిస్ట్ లకు ఏదైనా ప్రాణ హాని జరిగితే 50 లక్షల రూపాయల నష్ట పరిహారం అందించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
