స్వేచ్ఛను గుంజుకున్న కేసీఆర్‌‌‌‌కు ఓటమి తప్పదు : రేవంత్ రెడ్డి

స్వేచ్ఛను గుంజుకున్న కేసీఆర్‌‌‌‌కు ఓటమి తప్పదు :  రేవంత్ రెడ్డి

స్వేచ్ఛను గుంజుకున్న కేసీఆర్‌‌‌‌కు ఓటమి తప్పదు
సీఎంను బీఆర్ఎస్ నేతలే లైట్ తీసుకుంటున్నరు: రేవంత్ రెడ్డి
హైకమాండ్ పరిధిలో డీఎస్ చేరిక
సీనియర్లు అభ్యంతరం తెలిపినా చేరికలు ఆపొద్దని రాహుల్ చెప్పిన్రు
కొడంగల్ నుంచే పోటీ చేస్తానని వెల్లడి

నిజామాబాద్, వెలుగు : రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ లేదని, స్వేచ్ఛను గుంజుకున్న కేసీఆర్‌‌‌‌కు రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కల్వకుంట్ల ఫ్యామిలీ చేస్తున్న అవినీతిని తాము సీరియస్ గా తీసుకుంటున్నామే తప్ప కేసీఆర్‌‌‌‌ను కాదన్నారు. సీఎంను ఆ పార్టీ నేతలే లైట్ తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ బరిలో ఉంటానని స్పష్టం చేశారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కమ్మర్‌‌‌‌పల్లి మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌‌చాట్ చేశారు.

రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలిచే అవకాశమే లేదని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉందని, 32 నుంచి 34 శాతం ఓట్లు సాధిస్తామని, మరో 5 శాతం ఓట్ల కోసం తాము పోరాడుతున్నామని చెప్పారు. తాము సీట్ల వారీగా సర్వే చేయడం లేదని, ప్రజల మూడ్‌‌పై సర్వే జరుగుతోందని తెలిపారు. దేశంలో కాంగ్రెస్‌‌కు 150 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. పెద్ద రెడ్లు కేసీఆర్‌‌‌‌కు అమ్ముడుపోయారని, అందుకే కొత్త తరానికి అవకాశం వచ్చిందని రేవంత్ చెప్పారు. డీఎస్‌‌ చేరిక హైకమాండ్ పరిధిలో ఉందని, ఇప్పటికే ఆయన రెండు సార్లు సోనియాను కలిశారని చెప్పారు. త్వరలోనే  చేరికలు ఉంటాయని అన్నారు.  సీనియర్ నాయకులు అభ్యంతరం పెట్టినా చేరికలు ఆపొద్దని రాహుల్ చెప్పారని పేర్కొన్నారు. పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటే కచ్చితంగా చేర్చుకుంటామన్నారు. ఉత్తర తెలంగాణ పై ఫోకస్ పెట్టామని, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లను ముందుగానే ప్రకటిస్తామని తెలిపారు.

సెక్రటేరియెట్ నిర్మాణంలో భారీ అవినీతి 

బీఆర్ఎస్​ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న సెక్రటరియెట్, అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగిందని రేవంత్ ఆరోపించారు. వీటికి సంబంధించిన కాంట్రాక్టులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సోమవారం కమ్మర్​పల్లి మండలం ఏర్గట్లలో కార్నర్​ మీటింగ్​లో రేవంత్ మాట్లాడారు. ‘‘2018లో రూ.62 కోట్లతో అమరవీరుల స్థూపం కడతామని చెప్పారు. కానీ ఐదేండ్లలో ఈ బడ్జెట్ రూ.200 కోట్లకు పెంచారు. ఇందులో రూ.50 కోట్లు కమీషన్ల కింద ప్రశాంత్ రెడ్డి దండుకున్నారు” అని ఆరోపించారు. అమరవీరుల స్థూపం కాంట్రాక్టర్ నుంచి వాచ్ మెన్ వరకు అందరూ ఆంధ్రావాళ్లే ఉన్నారని చెప్పారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సర్పంచ్ కు ఎక్కువ, ఎంపీటీసీకి తక్కువని విమర్శించారు. 

తన సొంత ప్రాంతానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తెచ్చుకోలేని, అభివృద్ధి చేయని ఆయన మంత్రి ఎట్ల అయితరని అన్నారు. ‘‘మేం సమావేశం పెడితే రైతులు రాకుండా బీఆర్ఎస్ నేతలు, పోలీసులు అడ్డుకున్నారు. కేసులు పెడతామని బెదిరించారు. అయినా రైతులు భయపడకుండా సమావేశానికి వచ్చారు. వచ్చేది మా ప్రభుత్వమే.. మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే, అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లించాల్సి ఉంటుంది” అని హెచ్చరించారు.

భట్టి యాత్రకు హాజరవుతా..

భట్టి యాత్ర ఏఐసీసీ కార్యక్రమమని, దానికి తాను కూడా హాజరవుతానని రేవంత్ చెప్పారు. కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో సరైనవి కావన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ తరహా రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. లిక్కర్ స్కామ్‌‌లో రూ.100 కోట్ల కోసం రాద్ధాంతం చేస్తున్న బీజేపీ నేతలు.. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఖర్చు చేసిన వెయ్యి కోట్ల నిధులపై ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్‌‌ది వీధి నాటకమని, ఓట్ల కోసం పాము ముంగిస ఆట ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి బండి సంజయ్, అర్వింద్ ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు.