
- పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి
హైదరాబాద్, వెలుగు : పార్లమెంట్లో ఎంపీల ను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి అన్నారు. 79 మంది ఎంపీలను ఒకేరోజు సస్పెండ్ చేయడం పార్లమెంట్ చరిత్రలో తొలిసారన్నారు. అది పార్లమెంటరీ వ్యవస్థకు తీరని మచ్చ అని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆగంతకులు పార్లమెంట్ లోపలికి వెళ్లి దాడి చేయడం ఘోరమైన ఘటన అని, ఇంకేమైనా ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.
‘‘పార్లమెంట్ భద్రతపై చర్చించేందుకు ఎందుకు జంకుతున్నారు? కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎందుకు స్పందించడం లేదు? వికసిత్ భారత్ అంటే ఇదేనా?’’ అని ఆయన నిలదీశారు. ఇలాంటి ఘటనల పట్ల బీజేపీ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడి చేసిన రోజే అలాంటి ఘటన జరగడం భద్రతా వైఫల్యమేనన్నారు. దానిపై పార్లమెంట్లో చర్చ జరగాలని, ప్రజలందరికీ తెలియాలని మల్లు రవి డిమాండ్ చేశారు.