
హైదరాబాద్, వెలుగు: గతంలో ఓడిపోయిన సానుభూతితోనే సైదిరెడ్డి గెలిచారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. టీఆర్‌ఎస్ చెప్పిన మాయమాటలను కూడా ప్రజలు నమ్మారని చెప్పారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరామని, కానీ హుజూర్‌నగర్‌లో ప్రజాస్వామ్యం ఓడిపోయి ధనస్వామ్యం గెలిచిందని అన్నారు. హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు. గ్రామీణ ఓటర్లను ప్రలోభపెట్టినట్టు పట్టణ ఓటర్లను మభ్యపెట్టలేరని, మున్సి‘పోల్స్’లో పట్టణ ఓటర్లు విచక్షణతో వ్యవహరిస్తారని అన్నారు. ఉద్యమకారులెన్ని విమర్శలు చేసినా వివరణ ఇస్తామని.. తెలంగాణ ద్రోహులైన తలసాని, ఎర్రబెల్లి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.