రైస్ మిల్లర్పై పీడీ యాక్ట్.. రూ. 27 కోట్ల విలువైన సీఎంఆర్ ఎగ్గొట్టిన మిల్లర్

రైస్ మిల్లర్పై పీడీ యాక్ట్.. రూ. 27 కోట్ల విలువైన సీఎంఆర్ ఎగ్గొట్టిన మిల్లర్

సుల్తానాబాద్, వెలుగు: సీఎంఆర్ ఇవ్వకుండా ఎగవేసిన ఓ రైస్ మిల్లర్ పై పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కట్టా రాంపూర్ కు చెందిన బండారి మారుతి సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోని సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్, సౌభాగ్య లక్ష్మి ఇండస్ట్రీస్ రైస్ మిల్లుల్లో మేనేజింగ్ పార్టనర్ గా కొనసాగుతున్నాడు. రూ. 27 కోట్ల విలువైన సీఎంఆర్ ను ప్రభుత్వానికి అప్పగించకుండా ఎగ్గొట్టినట్లు దర్యాప్తులో తేలింది.

మారుతిపై 2024 నుంచి 2026 వరకు పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లోనూ ఇదే తరహా కేసులు నమోదైనట్లు గుర్తించారు. ప్రస్తుతం జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న మారుతిపై పీడీ యాక్ట్ పెట్టినట్లు రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝూ తెలిపారు. ఈ మేరకు కరీంనగర్ జైలులో ఉన్న మారుతికి సోమవారం సుల్తానాబాద్ సీఐ పి.రంజిత్ రావు, ఎస్సై చంద్రకుమార్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు అందజేశారు. అనంతరం నిందితుడిని హైదరాబాద్ లోని చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. సీఎంఆర్ పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.