
- ఇది నయా నాజీలపై ప్రపంచం చేస్తున్న యుద్ధం
- నాగరిక ప్రపంచం మద్దతునివ్వాలని విజ్ఞప్తి
- ఇజ్రాయెల్‌కు అండగా ఉంటాం: రిషి సునాక్
- ఇజ్రాయెల్ లో పర్యటించిన బ్రిటన్ ప్రధాని
జెరూసలెం: హమాస్ టెర్రరిస్టులపై జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ఆగేది కాదని.. ఇది సుదీర్ఘంగా కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు ప్రకటించారు. శాంతియుతంగా ఉన్న మిడిల్ ఈస్ట్‌లో హమాస్ టెర్రరిస్టులు రక్తపాతం సృష్టించారని మండిపడ్డారు. తాము శాంతిని విస్తరింపజేయాలని చూస్తుంటే.. హమాస్ మిలిటెంట్లు హింసను ప్రేరేపిస్తున్నారని ఫైర్ అయ్యారు. వారు నయా నాజీలు అని, సరికొత్త ఐసిస్ మూకలని ఫైర్ అయ్యారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ గురువారం ఇజ్రాయెల్‌లో పర్యటించారు. మిడిల్ ఈస్ట్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా టెల్అవీవ్ చేరుకున్న రిషి ఆ తర్వాత జెరూసలెం వెళ్లారు.
అక్కడే.. ఆ దేశ ప్రధాని నెతన్యాహు, ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జోగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాయింట్ ప్రెస్మీట్లో రిషి సునాక్‌తో కలిసి నెతన్యాహు మాట్లాడారు. హమాస్‌ను అస్సలు వదిలిపెట్టమని హెచ్చరించారు. హమాస్ వార్ స్టార్ట్ చేసిందని, ఇజ్రాయెల్ ఆర్మీ ముగిస్తుందన్నారు. ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సపోర్ట్ యుద్ధం ముగిసే దాకా కొనసాగించాలని కోరారు. గాజాలోని హాస్పిటల్‌పై తాము దాడి చేయలేదని మరోసారి స్పష్టం చేశారు. ఇది హమాస్ టెర్రరిస్ట్‌ల పనే అని మండిపడ్డారు.
ఇజ్రాయెల్‌కే మా మద్దతు: రిషి సునాక్
తనను తాను రక్షించుకోవడంతో పాటు హమాస్‌ను భూస్థాపితం చేయడంలో ఇజ్రాయెల్ కు తాను పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు. ఇజ్రాయెల్ ఎంతో బాధలో ఉందన్నారు. ఎప్పుడు కూడా టెర్రరిజానికి వ్యతిరేకంగా బ్రిటన్ నిలుస్తుందని తెలిపారు. ఉగ్రవాదంపై కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా హమాస్ టెర్రరిస్టులు రక్తపాతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
కానీ, ఇజ్రాయెల్ మాత్రం పౌరులకు ఇబ్బంది కల్గకుండా.. వారి ప్రాణాలు కాపాడుతూనే హమాస్‌పై దాడులు చేస్తున్నదన్నారు. పాలస్తీనియన్లు హమాస్ బాధితులే అని తెలిపారు. హెల్ప్ చేసేందుకు ఈజిప్ట్ ముందుకు రావడం సంతోషించాల్సిన విషయమని చెప్పారు. ఓ ఫ్రెండ్‌లా నెతన్యాహుకు అండగా ఉంటానని రిషి సునాక్ ప్రకటించారు. ఈ వార్‌లో ఇజ్రాయెల్ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
3,785 మంది పాలస్తీనియన్లు మృతి
నార్త్ గాజాలో నుంచి 10 లక్షల మంది పాలస్తీనియన్లు తమ ఇండ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. సేఫ్ జోన్‌గా ప్రకటించిన సౌత్ గాజాతో పాటు నార్త్ భూభాగంపై కూడా గురువారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడులు జరిపాయి. గడిచిన 11 రోజుల్లో 3,785 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. వీరిలో 1,524 మంది చిన్నారులు, వెయ్యి మంది మహిళలు, 120 మంది వృద్ధులు ఉన్నారు. 12,493 మంది గాయపడగా.. వీరిలో 3,983 మంది చిన్నారులు ఉన్నారని గాజా హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. 1,400 మందికి పైగా ఇజ్రాయెలీలు కూడా చనిపోయారు. గాజాలో హమాస్ చేతిలో బందీలుగా ఉన్న 206 మందిని గుర్తించామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అధికారులు ప్రకటించారు.
సౌత్ గాజాపై దాడులు
దక్షిణ గాజాలోని ఓ ఇంటిపై గురువారం తెల్లవారుజామున రాకెట్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు చనిపోయారని స్థానికులు తెలిపారు. హాస్పిటల్ స్ట్రెచర్‌పై చిన్నారుల డెడ్‌బాడీలు ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బక్రీ ఫ్యామిలీకి చెందిన మరో మూడు డెడ్‌బాడీలను కూడా ఖాన్ యూనిస్‌లోని గాజా యూరోపియన్ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. ట్రీట్ మెంట్ చేస్తున్న అక్కడి డాక్టర్లు చిన్నారుల డెడ్‌బాడీలు చూసి కన్నీరుపెట్టుకున్నారు.
ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ నేషనల్ సెక్యూరిటీ ఫోర్సెస్ హెడ్ జహెద్ మహెసేన్తో పాటు అతని కుటుంబ సభ్యులు చనిపోయారు. అలాగే పాలస్తీనా లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలు, హమాస్ పొలిటికల్ బ్యూరోలోని మొట్టమొదటి మహిళ అయిన జమీలా అబ్దల్లా తహా అల్ శాంతిని కూడా హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ప్రకటించింది.కొందరు హమాస్ టెర్రరిస్టులు ఇంకా ఇజ్రాయెల్‌లో ఉన్నారని, వారికోసం గాలిస్తున్నామని తెలిపింది.
గాజాలోకి ట్రక్కులు వెళ్లేందుకు అంగీకరించిన ఈజిప్ట్
ఇజ్రాయెల్‌కు జో బైడెన్ భారీ సాయం ప్రకటించారు. ఈ సాయం గాజాలోకి ప్రవేశించాలంటే గాజా – ఈజిప్ట్ బార్డర్‌లోని రఫా క్రాసింగ్ దాటాల్సి ఉంటుంది. సామాన్లతో కూడిన వందలాది ట్రక్కులు రఫా బార్డర్ వద్దే నిలిచిపోయాయి. గాజాలోకి వెహికల్స్ వెళ్లాలంటే ఈజిప్ట్ దారి ఇవ్వాల్సి ఉంటుంది. భద్రతా కారణాల రీత్యా ఈజిప్ట్ దీనికి ఒప్పుకోకపోవడంతో ఆ దేశ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సీసీతో యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ మాట్లాడారు. రఫా బార్డర్ నుంచి ట్రక్కులు గాజాలోకి వెళ్లేందుకు అనుమతించాలని కోరగా.. అబ్దెల్ అంగీకరించారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. శుక్రవారం రఫా బార్డర్ తెరుస్తామని అబ్దెల్ తెలిపారు. ట్రక్కులు వెళ్లేందుకు టైమ్ లిమిట్ పెడ్తామన్నారు. హమాస్ మిలిటెంట్లు తమ దేశంలోకి చొరబడే అవకాశాలు ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు.
కాఫీ, స్నాక్స్ ఇచ్చి.. ఏమార్చి.. ప్రాణాలతో బయటపడ్డాం
తమ ఇంట్లో చొరబడిన హమాస్ మిలిటెంట్లకు కాఫీ, స్నాక్స్ ఇచ్చి ప్రాణాలు కాపాడుకున్నట్లు 65 ఏండ్ల రచేల్ ఇద్రి, ఆమె భర్త డేవిడ్ తెలిపారు. ‘‘అక్టోబర్ 7న హమాస్ టెర్రరిస్ట్‌లు ఇంట్లోకి చొరబడి మమ్మల్ని బంధించారు. మా పిల్లలిద్దరూ పోలీసులే. వాళ్లొచ్చి మమ్మల్ని కాపాడుతారని తెలుసు. అందుకే కాఫీ, స్నాక్స్, కూల్‌డ్రింక్స్ ఆఫర్ చేశా. మా పిల్లల గురించి ఆరా తీయకుండా చూసుకున్న. అరబిక్ నేర్పిస్తే.. హిబ్రూ నేర్పిస్తా అని చెప్పా.
ఇలా 20 గంటల పాటు వారిని మాటల్లో పెట్టా. తర్వాత నా కొడుకు ఫోర్స్‌తో ఇంటికొచ్చాడు. అప్పటికే ఒక టెర్రరిస్ట్ నన్ను చంపేస్తానని బెదిరించాడు. ఇంట్లో ఐదుగురు టెర్రరిస్ట్‌లు ఉన్నట్లు వేళ్లతో సిగ్నల్ ఇచ్చా. వెంటనే వాళ్లు అందరినీ చంపేసి మమ్మల్ని కాపాడారు” అని రచేల్ చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్ ఆమెను హగ్ చేసుకుని అభినందించారు.